Lord Shiva Number 3 Significance : సంఖ్యా శాస్త్రం ప్రకారం మూడు సంఖ్య శుభప్రదమని అంటారు. మూడు సంఖ్యకు అధిపతి అయిన బృహస్పతి విష్ణువును ఆరాధిస్తుంటాడు. అందుకే మూడు సంఖ్య త్రిమూర్తుల స్వరూపమని కూడా అంటారు. ఆధ్యాత్మిక గ్రంధాల ప్రకారం ఒక రోజుకు నాలుగు జాములు ఉంటాయి. అందులో మూడో జాము అంటే సంధ్యా సమయం. ఈ కాలాన్నే ప్రదోషకాలం అని కూడా అంటారు. శివునికి ప్రీతికరమైన సంధ్యా సమయంలో శివుని పూజిస్తే మాములు సమయంలో పూజించిన దానికన్నా విశేష ఫలితం ఉంటుందని శాస్త్రవచనం.
ఏకబిల్వం శివార్పణమ్
శివునికి ప్రీతికరమైన మారేడు దళంలో కూడా మూడు ఆకులు ఉంటాయి. బిల్వ పత్రం లేని శివపూజ ఫలం ఇవ్వదని అంటారు. అంతేకాదు శివుని అర్చించే మారేడు దళాల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకొని ఉంటుంది. అందుకే శివుని బిల్వ పత్రాలతో పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది.
త్రిపుండ్రాలు
శివుని నుదిటిపై విభూతితో మూడు గీతలు వచ్చేలా త్రిపుండ్రాలు అలంకరిస్తారు. ఈ త్రిపుండ్రాలు దర్శిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, అభివృద్ధి ఉంటాయని పెద్దలు అంటారు.
త్రినేత్రం
పరమశివునికి మూడు కళ్లు ఉంటాయి. అందుకే శివుని త్రినేత్రుడని అంటారు. భూమిపై పాపాలు పెరిగిపోయినప్పుడు శివుడి తన మూడో కన్నును తెరచి మహా ప్రళయాన్ని సృష్టించి సమస్త భూమండలాన్ని లయం చేస్తాడని అంటారు.
త్రియాయుధం
శివునికి ఇష్టమైన ఆయుధం త్రిశూలం. త్రిశూలం మూడు అంచులు ఉన్న ఏకైక ఆయుధం. త్రిశూలంలో ఆకాశం, భూమి, పాతాళం ఉన్నాయని, సత్వ తమో రజో గుణాలకు ఈ త్రిశూలం తార్కాణమని అంటారు. పరమ శివునికి మూడు సంఖ్యకు కల అవినాభావ సంబంధం గురించి శివపురాణంలో ఈ విధంగా వివరించారు.
త్రిపురుల సంహారం
శివ పురాణంలోని కథ ప్రకారం పూర్వం ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలను నిర్మించుకొని ప్రజలను నానా కష్టాలకు గురిచేయసాగారు. రాక్షసులు ఈ నగరాలకు త్రిపుర అని పేరు పెట్టారు. ఈ మూడు నగరాలు వేరు వేరు దిశల్లో ఎప్పుడూ ఎగురుతూనే ఉండేవి. రాక్షసులు భూమిపై భీభత్సం సృష్టించి ఎవరికీ చిక్కకుండా తిరిగి తమ నగరాలకు వెళ్లేవారు.
దుర్లభం త్రిపుర నాశనం
ఈ మూడు నగరాలను ఒకే ఒక్క బాణంతో కొట్టి నాశనం చేయవచ్చు కానీ ఈ మూడు నగరాలు ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. అందుకే ఆ రాక్షసుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ రాక్షసుల కారణంగా దేవతలు కూడా ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది.
త్రిపురారి
త్రిపుర రాక్షసుల ఆగడాలు భరించలేక దేవతలు, మానవులు శివుని ఆశ్రయించారు. అప్పుడు ఆ మహేశ్వరుడు రాక్షసులపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాక్షస సంహారం కోసం భూమినే రథంగా మార్చాడు. సూర్యచంద్రులు ఆ రథానికి చక్రాలుగా మారారు. ఆదిశేషుడు విల్లుగా, శ్రీ మహావిష్ణువు ధనుస్సుగా మారారు. ఆ సమయంలో మంధర పర్వతాన్ని అధిరోహించి పరమేశ్వరుడు ఒక రోజు మూడు నగరాలు ఒకే సరళ రేఖలో వచ్చిన క్షణంలో రెప్పపాటులో బాణం వేసి మూడు నగరాలను, రాక్షసులను సంహరించాడు.
మూడు నగరాల భస్మ రాసుల నుంచి భస్మాన్ని తీసుకొని శివుడు తన ఒళ్లంతా పూసుకుంటాడు. ఈ రాక్షస సంహారం తర్వాత శివునికి త్రిపురారి అనే పేరు వచ్చింది. 'త్రిపుర' 'అరి' - త్రిపుర అనే రాక్షసులకు అరి అంటే శత్రువు కాబట్టి శివునికి త్రిపురారి అని పేరు వచ్చింది. ఆనాటి నుంచి శివుని ఆరాధనలో మూడు సంఖ్యకు ప్రాధాన్యం ఏర్పడింది. అందుకే అంటారు కదా! త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వమ్ శివార్పణమ్! భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ప్రతీక అయిన ఆ త్రినేత్రుని మనసారా ధ్యానిద్దాం. త్రిజన్మ పాపాలను పోగొట్టుకుందాం. ఓం నమః శివాయ
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.