Krishna Janmashtami 2024 Pooja Rituals: శ్రీకృష్ణాష్టమి రోజున.. కన్నయ్య భక్తులంతా హరే కృష్ణ హరే కృష్ణ నామాన్ని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే, గోకులాష్టమి(Janmashtami 2024) రోజు కృష్ణుని సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈ సమయంలో పూజ చేయాలని.. అలాగే జన్మజన్మల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ ప్రత్యేక దీపాన్ని వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. అది ఎప్పుడు? ఏ దీపం వెలిగించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ సమయంలో పూజిస్తే మంచిది: జన్మాష్టమి రోజు అద్భుతమైన ఫలితాలు పొందాలంటే.. ఆగష్టు 26వ తేదీ సోమవారం (అంటే.. తెల్లవారితే ఆగష్టు 27) అర్ధరాత్రి 12:05 నుంచి అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాల మధ్యలో కృష్ణుని పూజ చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్.
అదేంటి.. ఉదయమంతా వదిలేసి అందరూ నిద్రపోయే ముందు పూజ చేయడం ఏంటని ఆశ్యర్యపోతున్నారా? కానీ, కృష్ణుడు ఎప్పుడు జన్మించాడు? ఏ సమయంలో జన్మించాడు? అనే ప్రమాణాన్ని ఆధారంగా తీసుకొని కృష్ణ పూజ చేస్తే మంచిదంటున్నారు. పురాణాల ప్రకారం.. శ్రీ కృష్ణ పరమాత్మ రోహిణి నక్షత్రం, అష్టమి తిథి ఉన్నప్పుడు వృషభ లగ్నంలో అర్ధరాత్రి సమయంలో జన్మించారు. దీన్ని బట్టి ఆయన జన్మ సమయం అర్ధరాత్రి కాబట్టి ఆ టైమ్లో పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్.
శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు ? ఆగస్టు 26నా లేదా 27వ తేదీనా? - పండితుల సమాధానమిదే!
దీపం ఎప్పుడు వెలిగించాలంటే?: జన్మాష్టమి రోజు.. కృష్ణుడి సంపూర్ణ అనుగ్రహం పొందడం కోసం ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలని.. దాన్నే "శ్రీకృష్ణ దీపం" అంటారని అంటున్నారు. దీన్ని ఎప్పుడు వెలిగించాలంటే.. వీలైతే రాత్రిపూట పూజ చేసేటప్పుడు వెలిగిస్తే చాలా చక్కటి ఫలితం లభిస్తుందంటున్నారు జ్యోతిష్యులు కిరణ్. లేదు అంటే మాత్రం.. ఆగష్టు 26, 27వ తేదీలలో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వెలిగించుకోవచ్చని చెబుతున్నారు.
ఏ దిక్కులో వెలిగించాలంటే?: శ్రీకృష్ణ దీపాన్ని ఇంట్లో ఉత్తర దిక్కులో వెలిగించడం శుభకరమంటున్నారు. కాబట్టి.. పూజా గదిలో ఉత్తర దిక్కున శుభ్రంగా కడిగిన ఒక పీట ఉంచి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానిపై బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి.. బాలకృష్ణుని ఫొటో ఉంచాలి. ఆపై దాని ముందు భాగంలో మట్టి ప్రమీదలో ఆవు నెయ్యి పోసి.. అందులో ఆరు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి.. అది ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టాలి. అంటే.. ఫొటో, వెలిగే దీపం రెండు ఉత్తర దిక్కులో ఉండాలి. ఇలా కృష్ణాష్టమి రోజు ఉత్తర దిక్కులో వెలిగించే దీపాన్ని "శ్రీకృష్ణ దీపం" అంటారంటున్నారు మాచిరాజు కిరణ్.
పూజా విధానం :
- రాత్రిపూట కృష్ణ పూజ వీలుకానీ వారు ఉదయం పూట పూజ చేసుకోవచ్చు.
- ఆవిధంగా చేసేవారు పైన చెప్పిన విధంగా పూజా మందిరంలో ఉత్తర దిక్కున బాల కృష్ణుని ఫొటో పెట్టుకొని శ్రీకృష్ణ దీపం వెలిగించాలి.
- తర్వాత నల్లనయ్యకు ఇష్టమైన తులసి దళాలు, నీలం రంగు పుష్పాలను చల్లుతూ.. "ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః" అనే మంత్రాన్ని చదువుతూ పూజా కార్యక్రమం చేపట్టాలి.
- ఈ మంత్రాన్ని 108, 54, 21.. ఇలా వీలైనన్ని సార్లు చదువుకొని.. ఆపై కృష్ణుని అనుగ్రహం కోసం ప్రసాదాలు సమర్పించాలి. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, పటిక బెల్లం వంటివేవైనా నైవేద్యంగా పెట్టవచ్చంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్.
- ఇలా కృష్ణాష్టమి రోజు ప్రత్యేక సమయంలో పూజ చేయడం ద్వారా జన్మజన్మల దరిద్రం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయంటున్నారు.
పట్టిందల్లా బంగారం కావాలా? - "కృష్ణాష్టమి" రోజు కన్నయ్యను ఈ పూలతో పూజించండి!