Tumbhuru Teertham In Tirupathi : భారతదేశం కర్మభూమి. ఈ దేశంలో ఎన్నో దేవాలయాలు, ఎన్నో పవిత్ర తీర్థాలు ఉన్నాయి. ఇలాంటి పవిత్ర తీర్ధాలలో స్నానమాచరించడం వలన చేసిన పాపాలు పోయి మోక్షం కలుగుతుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పుణ్య నదులు, తీర్థాలు ఉన్నాయి. అందులో ఒక పరమ పవిత్రమైన తీర్ధం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
మోక్ష కారకం తీర్ధ స్నానం
వ్యాస మహర్షి రచించిన భవిష్యపురాణం హిందూ సంప్రదాయంలో తీర్ధ స్నానం, నదీ స్నానంకు ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తుంది. ముఖ్యంగా పవిత్ర తిధులలో, పర్వదినాలలో చేసే తీర్ధ స్నానం మోక్షాన్ని ప్రసాదిస్తుందని శాస్త్ర వచనం. అలాంటి ఒక మహిమాన్వితమైనదే తుంబుర తీర్థం
మోక్షం కలుగుతుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల క్షేత్రంలో ఎన్నో పుణ్య తీర్థాలు ఉన్నాయి. ఈ పుణ్య తీర్థాలలో ఎంతో మంది మహర్షులు స్నానమాచరించి, వాటి విశిష్ఠతను లోకానికి చాటి చెప్పారు. తిరుమల క్షేత్రంలోని పుణ్య తీర్థాలలో 'తుంబుర తీర్థం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు తొలగిపోయి, మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది.
తుంబుర తీర్థం విశిష్టత
కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ఒక ప్రళయం వచ్చింది. అప్పుడు ఒక కొండ రెండుగా చీలిపోవడం వల్ల తుంబుర తీర్థం ఏర్పడిందని వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలోని వేంకటాచల మహత్యం ద్వారా తెలుస్తోంది. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరదిశలో, సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది తుంబుర తీర్థం. తుంబురుడి పేరు మీద వెలసిన ఈ తీర్థంలోనే స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన అవసానదశను స్వామి ధ్యానంలో గడిపిందన్న నిదర్శనాలు నేటికీ అక్కడ ఉన్నాయి.
స్థల పురాణం
పూర్వం 'తుంబురుడు' అనే ఒక గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పమని మహర్షులను ప్రార్ధించాడు. అప్పుడు మహర్షులు తిరుమలలోని ఈ తీర్థంలో స్నానమాచరించమని గంధర్వునికి సూచించారు. మహర్షులు సూచించిన ప్రకారం ఆ గంధర్వుడు తిరుమల సమీపంలోని ఈ తీర్ధంలో స్నానం చేసి మోక్షాన్ని పొందాడట. 'తుంబురుడు' మోక్షాన్ని పొందిన తీర్థం కనుక, ఈ తీర్థానికి 'తుంబుర తీర్థం' అనే పేరు వచ్చింది. ఈ కారణంగానే తిరుమల వెళ్లిన భక్తులలో కొందరు, ఈ తీర్థానికి చేరుకుని అందులో స్నానమాచరిస్తుంటారు.
ప్రశాంత వాతావరణం
ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ తుంబుర తీర్థం చూడటానికి యాత్రికులను ఫాల్గుణ పౌర్ణమి నాడు మాత్రమే అనుమతిస్తారు. అయితే ఒక్కసారైనా ఈ తీర్ధంలో స్నానం చేయాలని భక్తులు తపిస్తూ ఉంటారు. తిరుమల యాత్రికులకు ఏడాది మొత్తం తుంబుర తీర్ధం దర్శించే అవకాశం లేకపోయినా ఫాల్గుణ మాసంలో దేవస్థానం వారు నిర్దేశించిన సమయంలో దర్శించి తుంబుర తీర్ధంలో పవిత్ర స్నానం చేసి మోక్షాన్ని పొందవచ్చు.శుభం భూయాత్!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.