Usiri Deepam Significance : కార్తిక మాసానికి ఉసిరి చెట్టు, ఉసిరికాయకు అవినాభావ సంబంధముంది. అసలు కార్తికానికి ఉసిరికకు ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణమేమిటి? కార్తిక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి? ఇందువల్ల కలిగే ఫలితమేమిటి అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈశ్వర స్వరూపం
వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తిక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తిక పూర్ణమి రోజు ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని తెలుస్తోంది.
లక్ష్మీదేవికి ప్రీతికరం
ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తిక మాసంలో ఉసిరిక దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం. అంతేగాకుండా కార్తిక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం.
ఉసిరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలి?
సాధారణంగా కార్తిక మాసంలో సోమవారం, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో, కార్తిక పౌర్ణమి వంటి విశేష తిథుల్లో ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు. ఈ రోజు సూర్యోదయంతోనే తలారా స్నానం చేసి శివాలయానికి కానీ విష్ణువు ఆలయానికి వెళ్లి ముందుగా మంచి ప్రదేశం చూసుకొని నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టాలి. ముగ్గును పసుపు కుంకుమలతో, పూలతో అలంకరించాలి. తరువాత ఉసిరికాయను తీసుకుని, పై భాగంలో గుండ్రంగా కట్ చేసి దానిలో ఆవు నేతిని నింపాలి. ఆపై తామర కాడలతో తయారైన వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పసుపు కుంకుమలతో, అక్షింతలతో అలంకరించాలి.
ఈ మంత్రాన్ని పఠించాలి
ఉసిరికాయ దీపాన్ని వెలిగించే సమయంలో 'ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమః' అనే మంత్రాన్ని పఠించాలి.
పౌరాణిక గాథ
కార్తిక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించడం వెనుక ఓ పౌరాణిక గాథ ఉంది. పద్మ పురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తిక మాసం వచ్చింది. అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోయేసరికి ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడంట! " కొన్ని గ్రహ దోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్ట కష్టాలు పడుతున్నారు. ఆ దోషాలు తొలగిపోవాలంటే అడవిలోని ఉసిరిక చెట్టు కింద ఉసిరిక కాయలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పగా "ద్రౌపది ఉసిరిక కాయలో ఆవు నెయ్యి పోసి తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేసిందంట! అంతట అదే ఉసిరిక చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానికి సుముఖత వ్యక్తం చేసాడంట! ఈ విధంగా ఉసిరిక దీపం వెలిగించి తరువాత పాండవులు యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందారని పురాణాల ద్వారా తెలుస్తోంది. సమస్త దోష పరిహారం. సకల శుభకరం
అందుకే నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే కార్తిక పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే కార్తిక మాసంలో ఉసిరిక దీపం వెలిగిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు, అష్ట దరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.