Kanchipuram Prithvi Lingam : పంచభూత లింగాలలో రెండవది అత్యంత మహిమాన్వితమైన శ్రీ కాంచీపురంలో వెలసిన పృథ్వీ లింగమైన శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో ఉంది. శ్రీ ఏకాంబరేశ్వర స్వామి పృథ్వీ లింగంగా ఇక్కడ విరాజిల్లుతున్నాడు. ఈ క్షేత్రం 108 శైవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతోంది.
స్థలపురాణం
పార్వతి తపస్సు - పరమశివుని పరీక్ష
కంచి ఏకాంబరేశ్వర స్వామి ఆలయ స్థలపురాణం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం క్రింద సైకత లింగాన్ని తయారు చేసి, పరమశివుని కోసం తపస్సు చేయగా, శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్నిని పంపాడంట. అంతట పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని శాంతిపచేయడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని పురాణగాథ.
సైకత లింగంపై ప్రవహించిన గంగమ్మ
శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింప జేయగా, సైకత లింగాన్ని కాపాడటానికి పార్వతి ఆ లింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఉండిపోయిందంట. అప్పుడు అమ్మవారి మహిమను తెలుసుకొన్న గంగ పార్వతికి ఎలాంటి హాని కలిగించలేదు. అప్పుడు అమ్మవారి ఆలింగనస్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణము.
ఈనాటికి సజీవ సాక్ష్యం
ఈ ఘటనకు సాక్షిగా ఇప్పటికీ ఇక్కడి ఏకాంబరేశ్వరుని లింగంపై అమ్మవారి కుచములు మనకు దర్శనమిస్తాయి. జనసమ్మర్దం లేని సమయంలో మనం పూజారిని అడిగితే మనకు తప్పక చూపిస్తారు.
ఆలయ విశేషాలు
ఈ క్షేత్రం పురాణ గాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఇక్కడ ఉన్న విష్ణువు ను వామన మూర్తిగా పూజిస్తారు. ఈ ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివ లింగాలు ప్రతిష్టించి ఉన్నాయి.
సంతాన ప్రాప్తిని కలిగించే అతి పురాతన మామిడి వృక్షం
ఈ దేవస్థానంలో మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విశేషమేమిటంటే ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షం. విచిత్రమేమిటంటే ఈ మామిడి చెట్టుకు గల నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్లు కాస్తాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే ప్రస్తుతం మనం చూడగలం. ఇక్కడి దేవస్థానం అధికారులు ఈ మామిడి చెట్టు యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు.
వధూ వరులుగా దర్శనమిచ్చే శివ పార్వతులు
ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీపరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూ వరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపో కామాక్షిని కూడా దర్శించవచ్చు.
ఉత్సవాలు వేడుకలు
ఈ ఆలయంలో నిత్యకర్మలు రోజుకు ఆరు సార్లు నిర్వహిస్తారు. ప్రతి కర్మ నాలుగు దశలను కలిగి ఉంటుంది. అభిషేకం, అలంకారం, నైవేద్యం, దీపారాధన. దీపారాధనలో భాగంగా ఉంజల్ సేవ నిర్వహిస్తారు. ఈ ఆలయంలోని ఏకాంబరేశ్వరుని లింగం ఇసుక దిబ్బతో చేసిన లింగం కనుక లింగం కిన ఉన్న పీఠానికి మాత్రమే అన్ని అభిషేక కర్మలు చేస్తారు. అంతేకాకుండా సోమవారం, శుక్రవారం వంటి వారపు ఆచారాలు, ప్రదోషం వంటి పక్షం రోజుల ఆచారాలు, అమావాస్య, కృత్తికా నక్షత్రం, పౌర్ణమి, చతుర్థి వంటి మాస పండుగలు కూడా విశేషంగా జరుగుతాయి.
నిత్యకల్యాణం పచ్చతోరణం
ఏడాది పొడవునా నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్లుగా విశేష ఉత్సవాలు జరిగే ఈ ఆలయంలో ముఖ్యమైనది ఫాల్గుణి బ్రహ్మోత్సవం. తమిళ ఫాల్గుణ మాసం అంటే మార్చి ఏప్రిల్ మధ్య కాలంలో జరిగే ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగి కల్యాణోత్సవం వేడుకతో ముగుస్తుంది. పరమ పవిత్రమైన కార్తిక మాసంలో ఏకాంబరేశ్వరుని దర్శించుకుందాం తరిద్దాం
జయ జయ శంకర హర హర శంకర ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.