- కామిక ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా గొప్ప వారవుతారు.
- కామిక ఏకాదశి రోజు ఆధ్యాత్మిక భావనలతో జాగరణం చేసిన వారికి యమధర్మరాజు భయం తొలగిపోతుంది.
- కామిక ఏకాదశి వ్రతం ఆచరించిన వారు జన్మరాహిత్యాన్ని పొంది మోక్షాన్ని పొందుతారు.
- కామిక ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణువును పూజిస్తే సకల పాపముల నుంచి విముక్తి పొందుతారు.
- శ్రీహరికి ఒక్క తులసి దళం సమర్పిస్తే వచ్చే పుణ్యం, బంగారం, వెండి దానం చేస్తే వచ్చే దాని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ.
- కామిక ఏకాదశి రోజు తులసి దళాలతో శ్రీహరిని పూజిస్తే ముత్యాలు, కెంపులు, పుష్యరాగాలు, వజ్రాలు, నీలమణులతో పూజించినదానితో సమానం.
- కామిక ఏకాదశి రోజు లేత తులసి దళాలతో శ్రీహరిని పూజిస్తే గత జన్మ పాపాలు కూడా పటాపంచలై పోతాయి.
- కామిక ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర నేతి దీపం పెట్టిన వారి పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు.
- కామిక ఏకాదశి రోజు శ్రీకృష్ణుని సమక్షంలో నువ్వుల నూనెతో, ఆవునేతితో దీపారాధన చేసి తులసి దళాలతో అర్చించిన వారు శాశ్వతముగా సూర్య లోకములో నివసించే అర్హత పొందుతారు.
- కామిక ఏకాదశి వ్రతానికి బ్రహ్మ హత్యా పాతకాన్ని, భ్రూణ హత్యా పాపాన్ని కూడా తొలగించే శక్తి ఉంది.
కామిక ఏకాదశి వ్రత కథ
Kamika Ekadashi Vrat Katha : ఒకసారి పాండవాగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుని ఆషాడమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించమని కోరగా శ్రీకృష్ణుడు సంతోషంతో ఇలా చెప్పాడు. 'ఓ రాజా! ఏకాదశి మహాత్యాన్ని ఎవరికైనా వివరించడం కూడా పుణ్య కార్యమే! ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మ దేవునితో ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి మహాత్యాన్ని వివరించి, ఆ రోజు ఎవరిని పూజించాలి? వ్రత విధానాన్ని సవివరంగా తెలియచేయమని అడిగాడంట!
అప్పుడు బ్రహ్మ దేవుడు లోకల్యాణం కోసం నీవు అడిగిన విషయాలను వివరిస్తాను శ్రద్ధగా విను' అంటూ ఇలా చెప్పసాగాడు. ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహాత్యం గురించి విన్నంతనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. కామిక ఏకాదశి రోజు శంఖ, చక్ర గదాధరుడు అయిన శ్రీ మహా విష్ణువును పూజిస్తారు. పాప మయమైన జీవితంలో కూరుకపోయినవారు ఏకాదశి వ్రత మాచరించి మోక్షమును పొందవచ్చు. ఈ కామిక ఏకాదశి వ్రత కథను బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను. కామిక ఏకాదశి వ్రతం ఆచరించిన వారు తప్పకుండా వ్రత మహాత్యాన్ని తెలుసుకొని, వ్రత కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకుంటే వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
బుధవారమే కామిక ఏకాదశి- ఈ పూజ చేస్తే ఎంతో పుణ్యం! ఎలా ఆరాధించాలో తెలుసా? - Kamika Ekadashi 2024