Jaya Ekadashi 2024 Date and Significance: మాఘమాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథిని జయ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి పురాణాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. జయ ఏకాదశి రోజున నియమ నిష్టలతో విష్ణువును పూజిస్తే.. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, అన్ని పాపాల నుంచీ విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ ఏడాది ఈ పండగ ఎప్పుడు వచ్చింది? విశిష్టత, పూజా విధానం ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
జయ ఏకాదశి తేదీ, సమయం: హిందూ సంప్రదాయంలో 12 ఏకాదశులకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాగా ఈ సంవత్సరం జయ ఏకాదశి 20 ఫిబ్రవరి 2024(మంగళవారం) వచ్చింది. ఫిబ్రవరి 19న ఉదయం 8:49 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై.. ఫిబ్రవరి 20, 2024 మంగళవారం ఉదయం 9:55 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. ఫిబ్రవరి 20 మంగళవారం నాడు విష్ణువును పూజించాలి. ఈ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. భీష్ముడు మోక్షం పొందిన రోజుగా దీనిని చెప్పుకొంటారు.
జయ ఏకాదశి పూజా విధానం:
- ఈ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
- ఆ తర్వాత తల స్నానం చేసి పూజ గదిని అలంకరించుకోవాలి.( ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడానికి పసుపు రంగు దుస్తులు ధరించాలి)
- ఇప్పుడు పూజగదిలో పీట ఏర్పాటు చేసి.. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వీలైతే శ్రీకృష్ణుడి విగ్రహాలను ప్రతిష్ఠించాలి.
- తర్వాత పసుపు, కుంకుమ, గంధం, పూలతో ప్రతిమలను అలంకరించాలి.
- తర్వాత నైవేద్యం సమర్పించి.. శుద్ధి చేసిన వెన్నతో దీపారాధన చేసి స్వామి వారిని ప్రార్థించాలి.
- మీకు వీలైతే తులసి ఆకులను కూడా మాలగా చేసి అలంకరించుకోవచ్చు. అయితే ఏకాదశి నాడు తులసి ఆకులను కోయకూడదు. కాబట్టి ముందురోజే వాటిని సిద్ధం చేసుకోండి.
- ఆ తర్వాత "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. వీలుంటే విష్ణు చాలీసా పఠించాలి.
- చివరికి, హారతి ఇచ్చి స్వామివారిని ప్రార్థించాలి.
- అంతేకాకుండా ఈరోజున ఉపవాసం ఉంటే కూడా మంచిదని అంటున్నారు పండితులు.
జయ ఏకాదశి విశిష్టత: పురాణాల ప్రకారం.. ఓసారి దేవతలు స్వర్గంలోని నందన్ అడవిలో ఒక ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి ఋషులందరినీ కూడా ఆహ్వానించారు. ఈ ఉత్సవంలో గంధర్వ బాలికల నృత్యం, గానం కార్యక్రమం నిర్వహించారు. పండగ సమయంలో, పుష్యవతి అనే నర్తకి.. మాల్యవాన్ అనే గంధర్వుడిని చూసి ఇష్టపడింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టి పండగలో ఉన్నారని కూడా గమనించకుండా ఇద్దరూ తమ పరిమితులను దాటి ఒకరికొకరు దగ్గరయ్యారు. అది చూసి ఉత్సవానికి హాజరైన వారంతా అసౌకర్యానికి గురయ్యారు. దాంతో ఇంద్రదేవుడు వారిని శపిస్తాడు. ఇక నుంచి స్వర్గంలో వారికి చోటు లేదని.. పిశాచ లోకంలో విహరిస్తారని అంటాడు.
ఆ తర్వాత ఇద్దరూ మోక్షం కోసం హిమాలయ శ్రేణులలో పిశాచాల రూపంలో సంచరించడం ప్రారంభించారు. వారిద్దరూ తమ తప్పునకు పశ్చాత్తాపపడి, క్షమాపణలు చెప్పిన తర్వాత, నారద ముని మాఘమాసంలోని శుక్ల పక్షం ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, విష్ణువును ధ్యానించమని చెబుతారు. దీంతో.. పుష్యవతి, మాల్యవాన్ ఆ రోజున ఉపవాసం ఉండి, పూజలను నిర్వహిస్తారు. దీంతో వారు పిశాచ జాతుల నుంచి విముక్తి పొందారు. ఇదే విధంగా భక్తులు జయ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే.. పిశాచ లోకంలో విహరించే వారి పూర్వీకులకు కూడా సుఖ సంతోషాలు కలుగుతాయని, అంతే కాకుండా.. వైకుంఠ ధామంలో శ్రీహరి పాదాల వద్ద నివసిస్తారని పండితులు చెబుతున్నారు.
సూర్యుడికి ఇలా నమస్కరించండి - అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!
ద్వారక ఎలా మునిగిపోయింది? శ్రీకృష్ణుడి నిర్యాణం కథేంటో తెలుసా?
కలియుగం అంటేనే దుష్టకాలం- కానీ ఈ సింపుల్ టిప్తో పుణ్యం మీ సొంతం!