Insurance Coverage For Sabarimala Pilgrims : హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు ఏ స్థాయిలో పోటెత్తుతారో తెలిసిందే. ఒక్కోసారి భక్తులకు ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో కొంతమంది భక్తులు స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తుంది! అయితే.. ఈ ఏడాది జరగబోయే మండల, మకరవిళక్కు సీజన్‌లో అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.
సౌకర్యంగా దర్శనం :
వచ్చే మండల, మకరవిళక్కు సీజన్‌లో అయ్యప్పస్వామి దర్శనం కోసం.. ఇక నుంచి రోజుకు 50 వేల మంది భక్తులను అనుమతించనున్నారు. భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ద్వారా టికెట్‌లను బుకింగ్ చేసుకుని స్వామి వారిని దర్శించుకోవచ్చు. అయితే.. గతంలో దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం పదిరోజుల ముందు నుంచి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ప్రస్తుతం మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కల్పించింది.
ఇన్సూరెన్స్ కూడా :
శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు ఆరోగ్య భద్రత కల్పించడానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వర్చువల్ క్యూ ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీని అందించనున్నట్లు ప్రకటించింది. యాత్ర సమయంలో అనుకోని ఇబ్బందులు తలెత్తితే ఇన్సూరెన్స్ అందించేందుకు దీనిని తీసుకువచ్చినట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. భక్తులు టికెట్‌లు బుకింగ్ చేసుకునే సమయంలోనే వారి వద్ద నుంచి రూ.10లను తీసుకుని ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తారు. దీనివల్ల అనుకోని సందర్భాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే భక్తులకు చాలా ఉపయోగంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
వీరికి ప్రత్యేకంగా :
అయ్యప్పస్వామి దర్శనం కోసం వచ్చే మహిళలు, చిన్నారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. అలాగే ప్రత్యేకంగా మహిళలు, దివ్యాంగుల కోసం అప్పం, అరవణ ప్రసాదం పంపిణీ కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను లెక్కించేందుకు, ప్రకటనల కోసం అరవణ ప్లాంట్ వద్ద కౌంటింగ్ సెన్సార్ ఏర్పాటు చేయనున్నారు. ఇంకా అన్నదాన మండపం వద్ద కూపన్‌ల స్థానంలో పీవోఎస్ మెషీన్ల ద్వారా టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే డోలీ సేవల కోసం ముందస్తుగానే ప్రీపెయిడ్ రిజిస్ట్రేషన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.