Independence Day Patriotism : మహాకవి గురజాడ అప్పారావు అన్నట్లు 'దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్'! దేశమంటే ఏదో కొన్ని భవనాలు, ప్రాజెక్టులు, డ్యాములు, నదులు, పర్వతాలు కాదు. వీటిలో కొన్ని ప్రకృతి మనకు ప్రసాదిస్తే, కొన్ని ప్రకృతిని ఉపయోగించుకొని మానవుడు నిర్మించాడు. ఏ దేశ ప్రగతినైనా ఎలా నిర్ధరిస్తారంటే ఆ దేశంలో ఉన్న సంపద, వ్యవసాయ రంగం, ప్రకృతి వనరులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్య వైద్య సదుపాయాలు, ధనిక, పేద, మధ్యతరగతి జనాభా శాతం ఆధారంగా దేశ ప్రగతిని అంచనా వేస్తారు. ఈ రకంగా చూస్తే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో నిలుస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడటానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయం.
యువతే కీలకం
ఏ దేశాభివృద్ధికైనా యువతే కీలకం. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో యువతే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఇంత యువశక్తి ఉండి కూడా మన దేశం వెనుకబడి ఉండటానికి గల కారణాలేమిటి? ఇందుకు ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి
1. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లిన యువత అక్కడే స్థిరపడుతున్నారు. ఇందుకు ప్రధానంగా ఆకర్షణీయమైన జీతాలే! అధిక సంపాదన కోసం, విలాసవంతమైన జీవితం కోసం విదేశాలకు తరలివెళ్లేవారు ఎక్కువయ్యారు. ప్రధానంగా యువతను ఆకర్షించేది విదేశాలలోని జీవనశైలి. డబ్బు సంపాదించుకోవడంలో తప్పులేదు కానీ మనదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ సంపాదించిన విజ్ఞానాన్ని ఇతర దేశాల అభివృద్ధికి ఉపయోగపడటం ఏ మాత్రం సమంజసమో యువత ఆలోచించాలి.
2. విదేశాలలో ఉండే సౌకర్యాలు, పరిశుభ్రమైన పరిసరాలు కూడా ఇందుకు ఒక కారణమే! ఈ దేశంలో రోడ్డు మీద ఉమ్మేసేవారు, వేరే దేశం పోతే ఆ పని చేయరు. ఎందుకంటే అక్కడ పెనాల్టీ కట్టాలి. ఇక్కడా అలాంటి నిబంధనలేమీ లేవు కదా! మన ఇల్లు శుభ్రంగా లేకపోతే మనమే బాగు చేసుకుంటాం కదా! అలాగే మన దేశాన్ని కూడా మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది ప్రతి ఒక్కరిలో రావలసిన చైతన్యం. మనలో చైతన్యం లేనప్పుడు ఎన్ని పెనాల్టీలు విధించినా ప్రయోజనం శూన్యం. ఇందుకు నడుం కట్టవలసింది ప్రజలే!
3. చదువుకున్న యువత భారతదేశంలో నిరుద్యోగ సమస్యను బూచిగా చూపించి ఇతర దేశాలకు తరలిపోవడం సబబు కాదు. ఇటీవల కాలంలో మన దేశం టెక్నాలజీలో ముందుంటోంది. స్టార్ట్ అప్ కంపెనీలకు ప్రభుత్వం ఎన్నో రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తోంది. యువత ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
స్వార్ధమే అనర్ధ కారణం
స్వార్ధాన్ని వీడి దేశాభివృద్ధి కోసం కొందరు ఆలోచించినా మన దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుంది. సహజ వనరులకు పుట్టినిల్లు అయిన మన దేశం ఎంతో గొప్పది. భారతదేశంలో పుట్టినందుకు మనమందరం గర్వించాలి.
సమసమాజ నిర్మాణమే ధ్యేయం
కుల మత, పేద ధనిక భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలి. అందరిదీ ఒకే మాట ఒకే బాట అన్నట్టు దీక్ష పూనిన రోజు లోకానికి మన భారతదేశం ఆదర్శం అవుతుంది. ప్రపంచానికే శుభ సందేశాన్ని అందిస్తుంది.
అందరికీ వందనాలు
స్వాతంత్య్ర దినోత్సవ శుభవేళ మన దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన మహనీయులకు శతకోటి నమస్కారాలు. దేశ రక్షణలో అశువులు బాసిన వీర జవాన్లకు నమస్సుమాంజలులు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు వందనం. దేశానికి వెన్నెముక అయిన రైతన్నలకు కృతజ్ఞతలు. చివరగా ఎందరో మహానుభావులు, మరెందరో మహనీయులు, అందరికీ వందనాలు. మనమందరం కూడా దేశ భక్తిని పెంచుకుందాం. దేశ గౌరవాన్ని పెంచుదాం
జై జవాన్! జై కిసాన్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.