How to Tie Venkateshwara Swamy Mudupu: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడుగా.. భక్తుల పాలిట కల్ప వృక్షంగా స్వామివారు పూజలను అందుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశవిదేశాల నుంచి కూడా నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే చాలా మంది భక్తులు శ్రీవారికి తమ సమస్యలను చెప్పుకుంటూ.. అవి తీరాలని ముడుపు కడతారు. తమ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆ ముడుపుని అత్యంత భక్తి శ్రద్దలతో స్వామివారికి చెల్లిస్తారు. అయితే సమస్యలు తీరాలన్నా, కోరికలు నెరవేరాలన్నా ఈ విధంగా ముడుపు కడితే 100శాతం ఫలితాలు లభిస్తాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ముడుపులు ఎవరు కడతారు: పిల్లలకు మంచి విద్య, సంతానం లేనివారికి సంతానం కలగాలని కోరుకోవడం, నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలగాలని, వ్యాపారస్థులకు వ్యాపారాభివృద్ధి కలగాలని, అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని, అవివాహితులకు వివాహం కలగాలని వంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని మాచిరాజు అంటున్నారు.
వేంకటేశ్వర స్వామివారికి ముడుపును ఎలా కట్టాలి:
- స్వామి వారికి ముడుపు కట్టే రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని నిత్య దీపారాధన చేయాలి.
- ఆ తర్వాత వినాయకుడికి మీ కోరిక విన్నవించాలి. అనంతరం ఏడుకొండలవాడికి ముడుపు కట్టాలి.
- ముందుగా ఓ గిన్నెలో కొద్దిగా పసుపు, గంధం, పచ్చ కర్పూరం వేయాలి. ఆ తర్వాత ఆ గిన్నెలో నీరు పోసి కలుపుకోవాలి.
- ఆ తర్వాత తెల్లటి వస్త్రాన్ని ఆ నీటిలో ముంచి కొద్దిసేపటి తర్వాత నీటిని పిండి ఆరేయాలి.
- ఇప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకుని నాలుగు మూలల నాలుగు కుంకమ బొట్లు పెట్టాలి. అలాగే వస్త్రం మధ్యలో ఓ కుంకుమ బొట్టు పెట్టి అక్కడ కుంకుమతో వేంకటేశ్వర స్వామి తిరునామాన్ని తీర్చిదిద్దాలి.
- ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఓ పీట మీద పరిచి ముందుగా ఆ వస్త్రంలో 7 ఎండు ఖర్జూరాలు ఉంచాలి. ఆ తర్వాత 7 యాలకులు, 7 లవంగాలు ఉంచి ఆ తర్వాత వాటిపై కొద్దిగా పచ్చ కర్పూరం వేయాలి. ఆ తర్వాత అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వేయాలి.
- ఆ తర్వాత 11 లేదా 21 లేదా 54 లేదా 108 లేదా 111 లేదా 116 లేదా 516 రూపాయి నాణేలు ఆ వస్త్రంలో ఉంచాలి. ఇలా నెంబర్స్ మాత్రమే కాకుండా మూడు దోసిళ్ల రూపాయి నాణేలు కూడా అందులో వేయొచ్చు.
- పైన చెప్పినవన్నీ వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టాలి. మొత్తంగా మూడు ముడులు వేసి మూట కట్టాలి. అలా ముడులు వేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరిక లేదా సమస్య చెప్పుకోవాలి.
- ఆ తర్వాత ఆ మూట మీద పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టాలి. ఆ మూట పై భాగంలో వేంకటేశ్వర స్వామి తిరునామాన్ని కుంకుమతో తీర్చిదిద్దాలి.
- ఇప్పుడు ఆ మూటను ఓ ప్లేట్లో ఉంచి వాటిని వేంకటేశ్వర స్వామి వారి చిత్రపటం వద్ద ఉంచి ధూపం సమర్పించాలి. ఆ తర్వాత వేంకటేశ్వర స్వామి నామాలు,వీలైతే గోవింద నామాలు కూడా చదువుకోవాలి.
- ఆ తర్వాత ఆ ముడుపును మీ సమస్య తీరేవరకు లేదా కోరిక నెరవేరేవరకు స్వామి వారి వద్ద ఉంచాలి.
- కోరిక లేదా సమస్య తీరిన తర్వాత ఆ ముడుపును వేంకటేశ్వర స్వామి ఫొటో వెనుక ఉంచి మీరు తిరుమల వెళ్లినప్పుడు హూండీలో ఈ మూట వేసి దానితో పాటు వడ్డీని సమర్పించాలి.
ఎంతో కష్టపడి తిరుమల కొండపైకి వెళ్లి, ఈ తప్పులు చేస్తున్నారా? - స్వామి వారి అనుగ్రహం లభించదు!
వేంకటేశ్వర స్వామి ముడుపు ఏ రోజు కట్టాలి: స్వామి వారికి ముడుపు శుక్రవారం లేదా శనివారం రోజున కట్టాలి. అలాగే తిథుల ప్రకారం చూసుకుంటే దశమి లేదా ఏకాదశి రోజున ముడుపు కట్టాలి. స్వామి వారికి ముడుపు కట్టేటప్పుడు ఆ మూటలో తులసి ఆకులు వేస్తే విశేషమైన ఫలితాలు పొందవచ్చని మాచిరాజు కిరణ్ కుమార్ అంటున్నారు.
NOTE: పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, పురాణాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.