How To Do Puja Of Lord Shiva On Monday : హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీ మహా విష్ణువు అలంకారప్రియుడు. అందుకే వైష్ణవ ఆలయాల్లో అలంకారాలు ఎక్కువగా చేస్తుంటారు. శివో అభిషేక ప్రియః అన్నారు అంటే శివునికి అభిషేకం అంటే ప్రీతి. చెంబుడు నీళ్లు ఆ శివలింగంపై పోసి నమస్కరిస్తే చాలు శివయ్య తప్పకుండా అనుగ్రహిస్తాడు.
గంగాజలం
హిందూ సంప్రదాయం ప్రకారం ఏ నీటి స్వరూపమైన గంగ అని పిలవడం పరిపాటి. శివునికి జలాభిషేకం అంటే ఎంతో ప్రీతి. జలం అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రతి సోమవారం శివలింగాన్ని కొద్దిపాటి జలంతో అభిషేకిస్తే చాలు శివానుగ్రహం పొందవచ్చు. మరి అందుకే శివుడు భక్త సులభుడయ్యాడు.
ఏకబిల్వం శివార్పణమ్
ఐశ్వర్యం కోరుకునే వారు సోమవారం నాడు పరమశివుని బిల్వ దళాలు అంటే మారేడు దళాలతో అర్చిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయని శాస్త్ర వచనం. దేవతా వృక్షంగా పేరొందిన మారేడు చెట్టు ఆకులు అంటే మారేడు దళాలలో శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉంటుందంట. మారేడు దళాలు శివ భక్తులకు సులభంగా దొరుకుతాయి. తన భక్తుల నుంచి ఆకులు తీసుకుని వారి అష్టైశ్వర్యాలు ప్రసాదించి పరమ శివుడు భక్తవశంకరుడు అయ్యాడు.
ఆరోగ్యమే మహా భాగ్యం
సోమవారం ఆవుపాలతో పరమ శివునికి అభిషేకం చేస్తే సమస్త అనారోగ్య సమస్యలు పోయి మంచి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గోవు పాలు కూడా సులభంగా దొరికేవే! చిన్న ఉద్ధరిణి ఆవుపాలతో శివయ్యని అభిషేకిస్తే చాలు మంచి ఆరోగ్యాన్ని మనకందించే భోళాశంకరుడు పరమ శివుడు.
పంచామృత స్నానం సమర్పయామి
పరమశివుని పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో అభిషేకిస్తే ఈతి బాధలు పోతాయి. అయితే పంచామృతాలతో అభిషేకించిన తర్వాత శివలింగానికి తప్పనిసరిగా జలంతో అభిషేకం చేయాలి.
దారిద్ర నాశిని విభూతి
పరమశివునికి విభూతి అంటే ఎంతో ఇష్టం. సోమవారం రోజు శివలింగాన్ని విభూతితో అభిషేకించి ఆ విభూతిని ఇంటికి తెచ్చుకుని ప్రతి రోజు నుదుటన ధరిస్తే దారిద్ర బాధలు పోయి సకల ఐశ్వర్యాలు సమకూరుతాయని శాస్త్ర వచనం. అయితే శివాభిషేకంలో వాడే విభూతి ఆవు పేడతో చేసిన పిడకల నుంచి తయారు చేసింది అయితేనే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు చెబుతారు.
భజ విశ్వనాధం
శివునికి భజనలన్నా, కీర్తనాలన్నా ఎంతో ప్రీతి. సోమవారం శివుని సన్నిధిలో లింగాష్టకం, బిల్వాష్టకం, శివాష్టకం వంటివి భజిస్తే మనం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు తొలగిపోయి అనుకూలత కలుగుతుంది.
ఈ నియమాలు తప్పనిసరి!
సోమవారం నియమ నిష్టలతో శివ పూజ చేసేవారు ఉపవాసం ఉండాలన్న నియమేమి లేదు. అసలు మితంగా సాత్విక ఆహారం తీసుకునే వారు ప్రతి రోజూ ఉపవాసం చేసినట్లే అని శాస్త్రంలో వివరించారు. ఇక నియమబద్దంగా సోమవారాలు శివ పూజ చేసేవారు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేసి శివాలయాన్ని సందర్శించాలి. తమ శక్తి మేరకు శివునికి అభిషేకాలు అర్చనలు చేయాలి. పండ్లు, పాలు, కూరగాయలతో చేసిన పదార్థాలను మితంగా స్వీకరించాలి. ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం తప్పనిసరి.
ఆత్మనివేదనంలో మనసే ప్రధానం
పరమశివుని పూజలో మనసే ప్రధానం. మనసును ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి. ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు. చెడు పనులు చేయకూడదు. అలాంటి పవిత్రమైన మనసును భక్తితో శివునికి అర్పిస్తే ఆ శివుని అనుగ్రహం వలన జన్మరాహిత్యం కలుగుతుంది. అంటే మళ్లీ పుట్టడం మళ్లీ చావడం వంటి జన్మకర్మల నుంచి విముక్తులం అవుతాం.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.