Lakshmi Pooja Vidhanam Telugu : 'కలౌ వేంకట నాధాయ' అంటారు. అంటే కలియుగంలో శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం అని అర్థం. శ్రీ మహాలక్ష్మిని శాశ్వతంగా తన వక్షస్థలంలో నిలుపుకున్న శ్రీనివాసుని పూజిస్తే సకల సంపదలు సొంతమవుతాయని అంటారు. శ్రీ వేంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం అమ్మవారి అనుగ్రహం సులభంగా పొందాలంటే అయ్యవారిని ఆశ్రయించాల్సిందే!
లక్ష్మీదేవి ప్రీతి కోసం ఇలా చేయాల్సిందే!
కలియుగ దైవంగా భక్తుల పూజలు అందుకునే వేంకటేశ్వరుని పూజించడం వలన కర్మ ఫలితంగా అనుభవించే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతారు. కలియుగంలో కష్టాలను తీర్చువాడు వేంకటేశ్వరుడు అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
దర్శనం పరమ పవిత్రం
శ్రీనివాసుని దర్శనం పరమ పవిత్రం. 'శ్రీ' అంటే లక్ష్మీ. 'నివాసుడు' అంటే కలిగి ఉన్నవాడు అని అర్ధం. అంటే లక్ష్మీదేవిని నిరంతరం తన వక్షస్థలంపై నిలుపుకున్న శ్రీనివాసుని దర్శిస్తే చాలు పాపాలన్నీ పటాపంచలై పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇది కేవలం వెంకన్న గొప్ప మాత్రమే కాదు వెంకన్న హృదయంలో ఉన్న సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా!
శుక్రవారం ఇలా పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి
శుక్రవారం ఐశ్వర్యానికి స్వాగతం చెప్పాలనుకునేవారు ఉదయాన్నే తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఆవు నేతితో దీపాన్ని వెలిగించి, సాంబ్రాణి ధూపం వేయాలి. వెంకటేశ్వర స్వామి చిత్ర పటం కానీ విగ్రహాన్ని కానీ పసుపు కుంకుమలతో అలంకరించిన పీటపై ఉంచుకోవాలి.
సిరికి హరికి పూజ
శ్రీ మహాలక్ష్మీ స్థిర నివాసమైన శ్రీనివాసుని వక్షస్థలాన్ని పసుపు కుంకుమలతో అలంకరించాలి. 108 తులసి దళాలను సేకరించాలి. శుక్రవారం తులసి దళాలు తెంపకూడదు కాబట్టి ముందు రోజే సేకరించుకోవాలి. ఇప్పుడు శ్రీలక్ష్మి అష్టోత్తర శత నామాలు ఒక్కొక్కటి చదువుతూ ఒక్కొక్క తులసి దళం స్వామి పాదాల వద్ద ఉంచాలి. పూజ పూర్తయ్యాక కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. శ్రీనివాసుని, శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన పొంగలి ప్రసాదాన్ని నివేదించాలి. కర్పూర నీరాజనం ఇచ్చి సాష్టాంగ దండ ప్రమాణం చేయాలి. పూజ పూర్తయ్యాక భక్తి శ్రద్దలతో గోవింద నామాలు చదువుకోవాలి. అనంతరం సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేయాలి. ఈ పూజకు కఠిన నియమాలు లేవు. పూజ పూర్తయ్యేవరకు ఉపవాసం ఉంటే చాలు. పూజలో భక్తి శ్రద్ధలు ముఖ్యం.
11 శుక్రవారాలు పూజించాలి
ఇలా నియమానుసారంగా 11శుక్రవారాలు పూజిస్తే దారిద్య్ర బాధలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. సంపద కొబ్బరికాయలోకి నీరు వచ్చినట్లుగా వస్తుంది. ఇక్కడ ఒక విషయం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. పూజ చేయగానే బీరువాలోకి డబ్బు వచ్చేయదు. మనం చేసే వృత్తి వ్యాపారాల్లో అప్పటి వరకు వస్తున్న ఆదాయం క్రమంగా వృద్ధి చెంది కొద్ది రోజులకు ఆర్థిక కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టపడకుండా ఏది రాదు. ఒకవేళ వచ్చినా అది నిలవదు.
కలియుగ ప్రత్యక్ష దైవానికి ఈ విధంగా చేసే పూజల వలన లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. ఈ కలియుగంలో చంచలమైన శ్రీ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేది శ్రీనివాసుని వక్షస్థలంలోనే! అందుకే నేరుగా తనని పూజించే కన్నా వేంకటేశ్వరుని పూజిస్తే అమ్మవారు వెయ్యి రెట్లు ఎక్కువగా అనుగ్రహిస్తారంట! అమ్మవారి ప్రాణనాథుడైన స్వామివారిని పూజించడం వలన ఆ తల్లి అనుగ్రహం కూడా లభిస్తుంది. శుక్రవారం చేసే ఈ పూజతో ఇంట్లో, పని ప్రదేశంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక అక్కడ నుంచి అన్నీ శుభాలే! సిరి సంపదలతో ఇల్లు కళకళలాడుతుంది.
ఓం నమో వేంకటేశాయ! శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
శుక్రవారం ఈ పనులు అస్సలు చేయకూడదు! ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం! - Dont Do This Things On Friday