Vastu Tips for Hanuman Photo : హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలనుకుంటున్నారా? అయితే, వాస్తు ప్రకారం కొన్ని విషయాలు తెలుసుకోవాలంటున్నారు వాస్తుశాస్త్ర పండితులు. ముఖ్యంగా.. ఏ రూపంలో ఉన్న విగ్రహాన్ని ఎంచుకోవాలి? ఏ దిశలో ఉంచితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? హనుమాన్ జయంతి రోజున ఏ విధమైన పూలు, నైవేద్యాలు సమర్పిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- వాస్తు ప్రకారం.. మీరు ఇంట్లో ప్రతిష్టించుకునే ఆంజనేయస్వామి(Hanuman) విగ్రహం లేదా చిత్రపటం పూజ గదిలో దక్షిణ దిశలో ఉండేలా చూసుకోవాలంటున్నారు వాస్తు పండితులు. అలాగే ఈ దిశలో 'కూర్చున్న భంగిమ'లో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిదంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయట.
- ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిత్యం స్వామిని పూజిస్తూ మంగళవారం సుందరకాండ పారాయణం చేయాలి. అప్పుడే మీకు హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయని చెబుతున్నారు వాస్తు పండితులు.
- ఇంట్లోని చీడ, పీడలను, దుష్టశక్తులను వదిలించుకోవడానికి ఇంటి దక్షిణ దిశ గోడపై కూర్చున్న భంగిమలో ఉన్న వాయుపుత్రుడి ఫొటోను తగిలించుకోవచ్చంటున్నారు. అయితే, ఈ ఫొటోలోని హనుమంతుడు ఎరుపు రంగులో ఉండే విధంగా చూసుకోవాలంటున్నారు.
- శత్రువులు, గృహ బాధలు, సంబంధాల్లో విభేదాలు, కుటుంబంలో ప్రతికూలతలు నివారించేందుకు.. వాస్తుప్రకారం పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం మంచిదని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అయితే, ఈ చిత్రపటం ప్రధాన ద్వారంపైన ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుందట.
- వాస్తుప్రకారం.. మీరు ఇంట్లోని డ్రాయింగ్ రూమ్లో శ్రీరామ దర్బార్ విగ్రహాన్ని పెట్టుకోవచ్చంటున్నారు వాస్తు పండితులు. అలాగే.. పంచముఖ ఆంజనేయస్వామి, హనుమంతుడు పర్వతాన్ని ఎత్తుతున్న ఫోటోను కూడా ఈ గదిలో ఉంచుకోవచ్చని చెబుతున్నారు
మంగళవారం హనుమాన్ జయంతి- అంజన్నకు ఇవి సమర్పిస్తే అన్నింటా విజయమే! - Hanuman Jayanti 2024
- ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కోసం ఆంజనేయస్వామి బొమ్మను ఇంట్లో ఉంచుకోవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే, హనుమంతుని శరీరంపై తెల్ల వెంట్రుకలు ఉన్న ఫొటో ఎంచుకుంటే మరీ మంచిదంటున్నారు.
- హనుమాన్ జయంతి రోజు హనుమంతుడికి నీరు సమర్పించిన తర్వాత.. పంచామృతాన్ని నైవేద్యంగా పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు.
- అదేవిధంగా.. నువ్వుల నూనెలో నారింజ, పచ్చిమిర్చి కలిపి నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
- ఈ రోజున వాయుపుత్రుడికి ఎరుపు రంగు పువ్వులు సమర్పించడం మంచిదంటున్నారు. అంతే కాకుండా.. బెల్లం లేదా గోధుమపిండితో చేసిన రోటి సుర్మాను నైవేద్యంగా పెట్టాలని చెబుతున్నారు.
- ఇలా చేయడం వల్ల భజరంగబలి సంతోషించి భక్తులకు సుఖసంతోషాలతో ప్రసాదిస్తాడని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
విగ్రహాన్ని ఉంచకూడని ప్రాంతాలు :
- వాస్తు ప్రకారం.. పడక గదిలో హనుమంతుడి ఫొటో పెట్టుకోవడం మంచిది కాదంటున్నారు వాస్తు పండితులు. ఇది వాస్తు దోషానికి దారితీస్తుందంటున్నారు. అందుకే.. పొరపాటున కూడా బెడ్రూమ్లో ఆంజనేయస్వామి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచుకోకూడదని సూచిస్తున్నారు.
- వాస్తు నిపుణుల సూచనల ప్రకారం.. మెట్ల కింద, వంట గదిలో హనుమంతుడి ఫొటో లేదా విగ్రహాన్ని ఉంచకూడదట. అలా చేశారంటే.. అది సమస్యలను తీసుకొస్తుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
శాపానికి ఉపశమనం- ఆంజనేయ స్వామి జననం- హనుమంతుడి జన్మ రహస్యం తెలుసా?