Good Things While Sunrise : సూర్యోదయం సమయంలో మనిషి పంచేంద్రియాలు సునిశితంగా, ఉత్తేజంగా ఉంటాయి. అందుకే సూర్యోదయం సమయంలో ముఖ్యమైన పనులు చేయాలి. చదువుకునే వారు సూర్యోదయం సమయంలో చదువుకుంటే బుద్ధి వికసనం అవుతుంది. హిందూ ధర్మ శాస్త్రాన్ని అనుసరించి సూర్యోదయం వేళ మనకు కనిపించే కొన్ని శుభ శకునాలు మనం ఆ రోజు పొందబోయే శుభ ఫలితాలను సూచిస్తుందని చెబుతోంది. మరి ఆ శుభ సంకేతాలు గురించి తెలుసుకుందాం.
కరాగ్రే వసతే లక్ష్మీ!
మనం ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేవగానే రెండు అరచేతులను చూసి నమస్కరించుకోవాలి. ఎందుకంటే మన అరచేతిలో అగ్ర భాగంలో లక్ష్మీ దేవి, మధ్య భాగంలో సరస్వతి దేవి, మూలంలో గౌరీ దేవి కొలువై ఉంటారని శాస్త్ర వచనం. ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి కావలసిన బుద్ధి నిచ్చే సరస్వతి, శక్తినిచ్చే గౌరీ దేవి, ఆర్థిక పుష్టిని ఇచ్చే గౌరీ దేవికి ఉదయాన్నే నమస్కరించడం వల్ల ఆ రోజు మనం చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.
ఉదయాన్నే ఇవి కనపడితే శుభకరం
ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు రాగానే చూడితో ఉన్న ఆవు కానీ, దూడకు పాలిస్తున్న ఆవు కానీ కనపడితే శుభ సూచకం. ఆ రోజు చేసే ప్రతి పనిలోనూ సానుకూలత ఉండడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయని శాస్త్రం చెబుతోంది.
ఈ మంగళకరం ధ్వనులతో శుభ వార్తలు
ఉదయాన్నే నిద్ర లేచే సమయంలో శంఖ నాదం, గుడి గంటల చప్పుడు, వేద మంత్రోచ్ఛారణ, ఆవు మెడలోని చిరు మువ్వల సవ్వడి వింటే ఆ రోజు తప్పకుండా శుభవార్తలు వింటారు. అంతే కాదు మన ఇంటికి ధన ధాన్యాలు, సిరి సంపదలు కూడా వస్తాయి. గతంలో అకస్మాత్తుగా ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. పొద్దున్నే నిద్ర లేవగానే పాలు, పెరుగు చూడటం భవిష్యత్తులో అందుకోబోయే అదృష్టానికి సంకేతం. ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలు, సన్నాయి మేళం వింటే ఆ రోజు తప్పకుండా ఏదో మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి.
ఇల్లాలు పూజ శుభప్రదం
సూర్యోదయం వేళ ఇంటి ఇల్లాలు ముంగిట్లో ముగ్గులు పెడుతూ కనిపించినా, తులసి పూజ చేస్తూ కనిపించినా ఆ రోజు ఇంట్లో తప్పకుండా శుభకార్యాలు జరగడం కానీ, శుభకార్య సంబంధిత చర్చలు కానీ జరిగి తీరుతాయి. ఉదయాన్నే వాకిట్లో ఆవు పేడతో వాకిట్లో కళ్లాపి చల్లడం కానీ, ముగ్గుల మీద ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టడం కానీ చూస్తే జీవితంలో ఇక తీరవు అనుకున్న సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది. సూర్యోదయం సమయం రోజు మొత్తం మీద ప్రభావవంతమైన సమయం. ఈ సమయంలో ప్రశాంతంగా, మంగళకర ధ్వనులు వింటూ సానుకూల విషయాలపై దృష్టి సారిస్తే లెక్కలేనన్ని శుభ ఫలితాలు పొందవచ్చునని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ పరిహారాలు పాటిద్దాం. ప్రతీ ఉదయాన్ని శుభోదయంగా మార్చుకుందాం
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
శుక్రవారం ఈ పనులు అస్సలు చేయకూడదు! ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం! - Dont Do This Things On Friday