Shri Girijatmaj Lenyadri Ganpati Temple Maharashtra : హిందూ సంప్రదాయం ప్రకారం విఘ్నేశ్వరుని పూజించనిదే ఏ పనిని మొదలు పెట్టరు. మహారాష్ట్ర లో వెలసిన అష్ట వినాయక క్షేత్రాలు ఒక క్రమ పద్ధతిలో దర్శిస్తేనే దర్శన ఫలం ఉంటుందని అంటారు. ఆ క్రమంలో దర్శించాల్సిన ఆరవ క్షేత్రం గిరిజాత్మజ్ వినాయక క్షేత్రం. ఈ ఆలయంలో వినాయకుని దర్శించి పూజిస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ విశేషాలేమిటో తెలుసుకుందాం.
బౌద్ధ గుహల మధ్య వెలసిన ఆలయం
శ్రీ గిరిజాత్మజ్ గణపతి దేవాలయం ఒక చిన్న కొండపై ఉన్నందున దీనిని గణేష్ గుఫా అని కూడా అంటారు. ఈ ఆలయంలో గణేష్ విగ్రహం చిన్న పిల్ల వాని రూపంలో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం విలక్షణమైన బౌద్ధ సంప్రదాయంలో ఉన్నందున బౌద్ధ గుహలు, హిందూ దేవాలయం కలిసి ఉన్నట్లుగా కనిపించే చిత్రమైన ఆలయంగా గిరిజాత్మజ్ గణపతి ఆలయం విరాజిల్లుతోంది.
పురాతన ఆలయం
క్రీ.శ. మూడో శతాబ్దానికి చెందినదని భావించే ఈ గిరిజాత్మజ్ గణపతి దేవాలయం చేరుకోవడానికి చేరుకోవడానికి 300 పైగా మెట్లు ఉంటాయి. స్తంభాలు లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే విద్యుద్దీపాల అవసరం లేకుండా పగటి వేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడం వల్ల సూర్యకాంతిలో ప్రశాంతంగా గణనాధుని దర్శించుకోవచ్చు.
ఆలయ స్థల పురాణం
నారద పురాణం ప్రకారం పార్వతీ దేవి సంతానం కోసం ఇక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతే నలుగుపిండితో చేసిన బాల గణపతికి ప్రాణం పోసిందనీ అంటారు. కౌమార ప్రాయం వచ్చేవరకూ గణపతి తన తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడని పౌరాణిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ ఆలయంలో గణపతి అచ్చు నలుగుపిండితో చేసినట్టే, స్పష్టమైన రూపురేఖలు లేకుండా ఉంటాడు. సాక్షాత్తూ పార్వతీదేవి సంతానం కోసం తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఈ ఆలయాన్ని సంతానం లేని దంపతులు దర్శిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
పెళ్లై ఏళ్లు గడిచినా సంతానం లేదా? - ఈ వ్రతం చేస్తే తప్పక పిల్లలు పుడతారు! - Mantras For Pregnancy