E Auction of Mobile Phones and Watches by TTD: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. నిత్యం వేలాది భక్తులు కాలి నడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను, ముడుపులను చెల్లించుకుంటారు. అయితే కొంతమంది ఏడుకొండలవాడికి తలనీలాలు సమర్పిస్తే.. మరికొద్దిమంది బంగారం, డబ్బులు, ఫోన్లు, వాచీలను హూండీలో వేస్తుంటారు. ఇలాంటి వస్తువులను వేలం ద్వారా భక్తులకు అందించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. నేరుగా కాకుండా ఈ-వేలం వేయనున్నట్టు తెలిపింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
శ్రీవారి ఆలయ హుండీతోపాటు ఇతర తిరుమల అనుబంధ ఆలయాల్లోని హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల్లో మొబైల్ ఫోన్లు, వాచీలను రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆసక్తి ఉన్న భక్తులు ఆన్లైన్ ఆక్షన్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది. ఇందులో.. టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, ఫాస్ట్‌ట్రాక్, టైమ్‌వెల్ తదితర కంపెనీల వాచ్‌లు కూడా ఉన్నాయి. అదే విధంగా వివో, నోకియా, కార్బన్, శాంసంగ్, మోటోరోలా, ఒప్పో తదితర కంపెనీల మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
వీటిని మూడు కేటగిరీలుగా విభజించి వేలంలో పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. వాటిలో డ్యామేజి ఫోన్లు, వాచీలు, ఉపయోగించినవి, కొత్తవి అనే మూడు రకాలుగా విభజించి భక్తులకు అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలిపింది. వీటిలో కొత్త వాచ్, ఫోన్లతో పాటు సెకండ్ హ్యాండ్ గాడ్జెట్లు, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 14 లాట్లు, స్మార్ట్‌ఫోన్లు 24 లాట్లు ఈ-వేలంలో ఉంచనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ-వేలాన్ని జూన్ 24వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ వస్తువులు కావాలని కోరుకునే భక్తులు ఈ-వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.tirumala.org తో పాటు www.konugolu.ap.gov.in వెబ్ సైట్స్‌ను సందర్శించవచ్చని సూచించింది. అంతేకాకుండా ఈ వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 0877-2264429 ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అని తెలిపింది.
ప్రత్యేక దర్శన టికెట్లు : స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే తిరుమల, తిరుపతిలో సెప్టెంబర్ నెలకు సంబంధించి గదులను జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు కూడా వెల్లడించింది.