Sravana Masam 2024 : శివ పురాణంలో శ్రావణ మాసంలో చేసే దానధర్మాల గురించిన ప్రస్తావన ఉంది. ఈ ఏడాది శ్రావణంలో ఐదు సోమవారాలు రానున్నాయి. ఈ ఐదు సోమవారాల్లో శివుని ప్రత్యేకంగా పూజిస్తూ, ఈ మాసంలో కొన్ని ప్రత్యేక వస్తువులు దానం చేయడం వల్ల పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. నిజానికి ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రకారం ఐశ్వర్యం వృద్ధి చెందడానికి సులభమైన మార్గం దానాలు చేయడమే! సంపదను పెంచుకోవడం కాదు పంచుకున్నప్పుడే అది సద్వినియోగం అవుతుందని శాస్త్ర వచనం.
శ్రావణ సోమవారాలలో ఎలాంటి దానాలు చేయాలి?
- శివ పురాణం ప్రకారం జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటే శ్రావణ సోమవారం లేదా శ్రావణ శనివారం రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని గ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుంది.
- వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుకు ప్రతికూల శక్తిని తొలగించే శక్తి ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదుర్కొనే వారు, గృహంలో ప్రతికూల శక్తులతో బాధపడేవారు శ్రావణ మాసంలో శనివారం రోజు ఉప్పును దానం చేస్తే ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభిస్తుంది.
- పరమశివుని ప్రతిరూపంగా భావించే రుద్రాక్షలను శ్రావణ మాసంలో దానం చేసిన వారికి ఆయుష్షు పెరుగుతుందని, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
- శ్రావణ మాసంలో విష్ణువుకు ప్రీతికరమైన పసుపు రంగులో ఉండే వస్త్రాలను పేదలకు దానం చేస్తే జీవితంలో అన్న వస్త్రాలకు లోటుండదని శాస్త్ర వచనం.
- శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమైన బియ్యాన్ని అన్నార్తులకు దానం చేస్తే కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరిస్తాయి.
- శ్రావణ మాసంలో కొబ్బరికాయలను దానం చేయడం వల్ల ఇంట్లో కలహాలు, వివాదాలు తగ్గుముఖం పడతాయి. అలాగే సుఖశాంతులు, శాంతి నెలకొంటాయని విశ్వాసం.
- అలాగే శ్రావణ మాసంలో నెయ్యితో నింపిన వెండి దీపం, బంగారం లేదా కంచు పాత్రలు, మినుములు, బెల్లం, పసుపు రంగు పువ్వులు, ఎర్రచందనం, కర్పూరం, కుంకుమ, శంఖం, గరుడ గంట, ముత్యం, వజ్రం, పచ్చరాయి, పత్తి బట్టలు, పట్టు వస్త్రాలు, నువ్వుల బెల్లం, గోధుమలు, బియ్యం, పాలు, చక్కెర, తేనే, రాగి పాత్ర, వెండి నంది వంటి శుభకరమైన వస్తువులు దానం చేయడం వలన ఇహలోకంలో అపారమైన సిరిసంపదలతో తులతూగి అంత్యమున మోక్షం పొందుతారని శివ మహాపురాణం ద్వారా తెలుస్తోంది.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
తాళికట్టు 'శ్రావణ' వేళ.. మెడలో 'కల్యాణ' మాల..!
Gold Purity Check : శ్రావణమాసంలో బంగారం కొనాలా?.. ఆభరణాల స్వచ్ఛత తెలుసుకోండి ఇలా?