Deepa Danam In Karthika Masam Benefits : పరమ పవిత్రమైన కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు, మోక్షసాధనకు విశిష్టమైనది. ఆధ్యాత్మిక పరంగా ఈ మాసానికి అపారమైన ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీకమాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీప దానం వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అసలు దీప దానం అంటే ఏమిటి? దీపదానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శివకేశవుల ప్రీత్యర్ధం
శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం నెల రోజుల పాటు భక్తులు విధిగా దీపాలు వెలిగించి పరమేశ్వరుడి అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. అలాగే విష్ణువు, లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ఆలయాల్లో, తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం, దీప దానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని శాస్త్ర వచనం. అసలు దీప దానం ఎందుకు చేస్తారు? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
జ్ఞానోదయాన్ని కలిగించే దీపంఞ
కార్తీకమాసంలో దీపం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. దీప దానం ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందింస్తుంది. జ్వాల మనలోని జ్ఞానాన్ని సూచిస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించమని కోరుకుంటూ దీప దానం చేస్తారు. శివాలయంలో కాని విష్ణు ఆలయంలో కానీ నెయ్యి దీపాలు దానం చేయడం వల్ల అంతర్గత శాంతి పెరుగుతుంది.
శ్రేయస్సు, అదృష్టాన్ని ఇచ్చే దీపదానం
కార్తీకమాసంలో దీప దానం చేయడం వల్ల శ్రేయస్సు, అదృష్టం వృద్ధి చెందుతాయి. తలపెట్టిన అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది.
తొలగిపోయే ప్రతికూలతలు
కార్తీకమాసంలో దీప దానం చేయడం వల్ల తరతరాల నుంచి వస్తున్న పాపాలు తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతల నుంచి విముక్తి కలుగుతుంది. దీపదానం వలన పాపపరిహారం కలిగి మనసు, శరీరం, ఆత్మ శుద్ధి అవుతుంది.
ఆరోగ్య కారకం దీపదానం
కార్తీకమాసంలో ఆలయాలలో దీపం దానం చేయడం వలన అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభించి స్వస్థత చేకూరి, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.
మనోభీష్ట సిద్ధి
కార్తీక మాసంలో చేసే దీపదానం వలన దైవానుగ్రహంతో తెలిసీ తెలియక చేసిన పాపాలు నశించిపోయి, సానుకూల శక్తులు పుంజుకుంటాయి. ప్రతి పనిలో అనుకూలత లభించి సకల మనోభీష్టాలు నెరేవేరుతాయి.
దీపదానం ఎలా చేయాలి?
దీపదానం చేయాలనుకునే వారు తలారా స్నానం చేసి సమీపంలోని శివాలయానికి కానీ విష్ణువు ఆలయానికి కానీ వెళ్లి రెండు మట్టి ప్రమిదలు కానీ, వెండి కాని, ఇత్తడి కాని రెండు కుందులలో ఆవు నీటిని పోసి రెండు వత్తులు వేసి దీపారాధన చేసి సమంత్రక పూర్వకంగా బ్రాహ్మణుల సమక్షంలో దీపాలను దానం చేయాలి.
దీపదానం చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రం
సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ అనే మంత్రాన్ని పఠిస్తూ దీపదానం చేయాలి. రానున్న కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో దీపదానాలను చేద్దాం. సకల శుభాలను పొందుదాం. ఓం నమః శివాయ! ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.