Chaturmas 2024 Vrat Katha In Telugu : ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ కాలంలో యతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు. అతి ప్రాచీన కాలం నుంచి మనదేశంలో ఈ చాతుర్మాస వ్రతాన్ని మునీశ్వరులు పాటిస్తూ ఈ సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించారు. ఇప్పటికీ యతులు, సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తునే ఉన్నారు. చాతుర్మాస వ్రతం యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య, స్కాంద పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది.
చాతుర్మాస వ్రతం ఎప్పుడు మొదలవుతుంది
పంచాంగం ప్రకారం ఈ ఏడాది చాతుర్మాసం జూలై 17న ప్రారంభమై నవంబర్ 12తో ముగుస్తుంది. అంటే సుమారు నాలుగు నెలల కాలం పాటు ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది.
చాతుర్మాస వ్రతాన్ని ఎవరు ఆచరించాలి?
చాతుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి మహిళ, పురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మొదలైన వారు ఎవరైనా చేయవచ్చు. అయితే ఈ వ్రతానికున్న కఠినమైన నియమాల కారణంగా ప్రస్తుత కాలంలో ఈ వ్రతం పీఠాధిపతులు, మఠాధిపతులు, యతులకు మాత్రమే పరిమితమైంది.
చాతుర్మాస వ్రత నియమాలు
చాతుర్మాసం వ్రతాన్ని ఆచరించేవారు ఆహారం విషయంలో కొన్ని కచ్చితమైన నియమాలు పాటించి తీరాలి. అవేమిటంటే ఈ నాలుగు నెలల కాలంలో మొదటి నెలలో ఆకుకూరలు, కూరగాయలు తినరాదు. రెండో నెలలో పెరుగు, మజ్జిగ విడిచి పెట్టాలి. మూడో నెలలో పాలు తీసుకోకూడదు. నాలుగో మాసంలో పప్పు దినుసులు తినకూడదు. ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
మరికొన్ని నియమాలు
- చాతుర్మాస వ్రతం ఆచరించే వారు పురాణ గాధలు వింటూ, ఆధ్యాత్మిక చింతనతో కాలం గడపాలి.
- ఈ నాలుగు మాసాలు నివసిస్తున్న ఊరి పొలిమేరలు దాటకూడదు. అంటే ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు.
- ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో నదీ స్నానం తప్పనిసరిగా చేయాలి. అందుకే పీఠాధిపతులు పవిత్రమైన గంగానది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ నాలుగు నెలలు ఎక్కడకు కదలకుండా అక్కడే ఉంటారు.
- చాతుర్మాస వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస వంటి నియమాలు కచ్చితంగా పాటించాలి.
- గురువు నుంచి ఉపదేశం పొందిన ఇష్టదేవతల దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి.
- ప్రతి నిత్యం లక్ష్మీనారాయణులను పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణ విధిగా చేయాలి.
- ప్రతిరోజూ తులసి మొక్కకు పూజ చేసి సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి.
- ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి.
- భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి.
- కోపావేశాలు, రాగ ద్వేషాలకు అతీతంగా జీవించాలి. ఇతరులను చూసి అసూయ పడటం, అబద్ధాలు ఆడటం, అహంకారం వంటి భావోద్వేగాలకు దూరంగా ఉండాలి.
- చాతుర్మాస సమయంలో క్షవరం చేయడం నిషిద్ధం.
- చాతుర్మాసంలో చేసే దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో గోదానం అత్యంత శ్రేష్టం.
గురు వందనం
చాతుర్మాస వ్రతాన్ని ఆచరించడం మానవాళికి ఎంతో శుభం, ఆనందం చేకూరుస్తాయని అందరి నమ్మకం. చాతుర్మాస వ్రత నియమాలు కఠినమైనవి కనుక రోజువారీ కార్యక్రమాలతో సామాన్య మానవులకు ఆచరించడం సాధ్యం కాదని లోక కళ్యాణం కోసం ఈ వ్రతాన్ని యతులు, సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఆచరిస్తారు. మనందరి మేలు కోసం చాతుర్మాస వ్రతం ఆచరించే గురువులకు పాదాభివందనం చేస్తూ జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
సోమవారమే దక్షిణాయనం ప్రారంభం- శుభ ఫలితాల కోసం ఇలా చేయండి! - Dakshinayana Punyakalam 2024
హనుమంతుడిని 'చిరంజీవి' అని ఎందుకు అంటారు? ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? - why hanuman is chiranjeevi