Black Hanuman Temple History : జైపూర్ లోని హవా మహల్ సమీపంలో ఉన్న హనుమంతుని ఆలయంలోని హనుమ విగ్రహం నల్లని రంగులో ఉంటుంది. ఈ ఆలయంలో హనుమంతుడు తూర్పు ముఖంగా వెలసి భక్తులచే పూజలందుకుంటున్నాడు. ఇక్కడ హనుమంతుని విగ్రహం నల్లగా ఉండటం వెనుక ఉన్న పౌరాణిక రహస్యం గురించి తెలుసుకుందాం.
సూర్యునికి హనుమ గురుదక్షిణ
వాయు పురాణం ప్రకారం హనుమంతుడు సూర్యుని వద్ద విద్యలను అభ్యసించాడని తెలుస్తోంది. విద్యాభ్యాసం పూర్తయ్యాక హనుమ సూర్యుని గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో కోరుకోమన్నాడంట! అప్పుడు సూర్యుడు హనుమతో తన కుమారుడు శనీశ్వరుడు తన మాట వినకుండా తనను విడిచి వెళ్లాడని అతనిని తిరిగి తీసుకురావాలని అభ్యర్థించాడు. ఇదే తనకు ఇవ్వాల్సిన గురుదక్షిణ అని సూర్యుడు హనుమతో చెప్పాడు.
శనీశ్వరుని వద్దకు వెళ్లిన హనుమ
తన గురువైన సూర్యునికి గురుదక్షిణ ఇవ్వడం కోసం హనుమంతుడు శనీశ్వరుడు వద్దకు వెళ్లి సూర్యుని కోరికను వివరించి అతని తండ్రి వద్దకు తిరిగి రావాలని ప్రార్ధించాడు. కానీ హనుమంతుని చూసిన శనీశ్వరునికి చాలా కోపంగా కలిగిందంట! ఆ కోపంతోనే శనీశ్వరుడు హనుమను చూడగా, ఆ కోపాగ్నికి హనుమంతుడి ఛాయ నల్లగా మారిందట!
హనుమకు శనిదేవుని వరం
శనీశ్వరుని దృష్టికి హనుమ ఛాయ నల్లగా మారింది కానీ, హనుమకు ఎలాంటి ఆపద కలగలేదు. శని తీక్షణ దృష్టి హనుమను ఏమి చేయలేకపోయింది. అంతేకాదు హనుమంతుడు శనీశ్వరుడిని ఒప్పించడంలో విజయం సాధించాడు. అది చూసిన శని ప్రసన్నుడై హనుమంతుని భక్తికి కార్య దీక్షకు సంతోషించాడు. శనివారం హనుమను పూజించిన వారికి శని బాధలుండవని హనుమకు శని భగవానుడు వరం కూడా ఇచ్చాడు. అందుకే శనివారం హనుమకు 11 ప్రదక్షిణలు చేస్తే ఏలినాటి శని బాధలుండవని విశ్వాసం.
పిల్లల ఆరోగ్యానికి రక్ష
ఈ ఆలయంలో హనుమంతుని ఆశీస్సులతో ఒక అద్భుతమైన దారాన్ని తయారు చేసే అనారోగ్య సమస్యలు ఉన్న చిన్న పిల్లలకు రక్షగా కడితే అనారోగ్య సమస్యలు తొలగిపోయి స్వస్థత చేకూరుతుందని విశ్వాసం. అందుకే ఇక్కడ ఇచ్చే రక్ష కోసం కోసం దేశ విదేశాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
జైపూర్లోని నల్ల హనుమంతుని ఆలయంలో ప్రతిరోజూ విశేష పూజలు, అర్చనలు, మూడు సంధ్యలలో హారతులు జరుగుతాయి. ప్రతిరోజూ భక్తులు ఇక్కడ హనుమంతుని దర్శనం కోసం వస్తారు. మంగళవారం, శనివారాల్లో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి మంగళ, శనివారాలలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం జరుగుతాయి.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.