How to Worship Sun God : హిందూ పురాణాల ప్రకారం.. సూర్యుడిని భగవంతుడిగా భావిస్తారు. అందుకే.. రోజూ సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం పుణ్యప్రదమని భక్తులు నమ్ముతారు. ఇలా చేయడం వల్ల.. జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారని విశ్వాసం. అంతే కాకుండా.. నిత్యం సూర్యుడికి నమస్కరించడం వల్ల.. శారీరక వ్యాధులు దరిచేరవని నమ్ముతారు. అయితే.. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే ముందు కొన్ని నియమాలు తెలుసుకోవడం ముఖ్యమని పండితులు చెబుతున్నారు. వాటిని అనుసరిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చంటున్నారు. మరి.. ఆ నియమాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సూర్యడికి అర్ఘ్యం సమర్పించే నియమాలు :
- మీరు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించాలి. అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు అన్నమాట. ఇలా లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
- ఇలా రోజూ భానుడికి నీళ్లు సమర్పిస్తే.. డబ్బుకు ఇబ్బంది ఉండదంటున్నారు పండితులు.
- వీలైతే ఉదయించే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం ద్వారా విశేష ఫలితాలు పొందుతారు.
- ఆదిత్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమిటంటే.. మీ రెండు చేతులను తలపైకి లేపి నీటిని సమర్పించాలి.
- అవకాశం ఉంటే.. ఎరుపు రంగు దుస్తులు ధరించి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిదట.
- అర్ఘ్యం నైవేద్యంగా పెట్టేటప్పుడు నీళ్లలో ఎర్రని పువ్వులు కలుపుకుంటే చాలా మంచిది అంటున్నారు పండితులు.
- సూర్య భగవానుడికి నీటిని సమర్పించేటప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి.
- జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. సూర్యుడికి ఎప్పుడూ ఉదయం పూట మాత్రమే అర్ఘ్యం సమర్పించాలి.
- ఒకవేళ మీరు సూర్యుడిని చూడలేకపోతే.. భానుడి పేరు తలచుకుంటూ, మీరు నిలబడి ఉన్న చోట అర్ఘ్యం సమర్పించవచ్చు.
- భానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మూడుసార్లు ప్రదక్షిణలు చేసి భూమికి నమస్కరించాలి. ఈ టైమ్లో ఓం సూర్యాయ నమః మంత్రాన్ని జపించాలి.
- సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు.. 'ఓం ఆదిత్య నమః', 'ఓం ఘృణి సూర్యాయ నమః' అనే మంత్రాలనూ జపించవచ్చు.
- ఈ విధంగా సూర్యుడికి నీరు సమర్పించడం వల్ల నేరుగా నవగ్రహాల ఆశీస్సులు అందుతాయట.
దేవుడి సన్నిధిలో - ఏ నూనెతో దీపం వెలిగించాలి?
సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పొందే శారీరక ప్రయోజనాలు:
- లేలేత భానుడి కిరణాల సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే ఆధ్యాత్మికతతోపాటు ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరతాయి.
- సూర్యకిరణాలు తట్టుకోలేనంత తీవ్రం కాకముందే ఈ కార్యక్రమం ముగించాలి.
- ఈ సమయంలో వచ్చే సూర్యరశ్మిలో ఉండడం వల్ల శరీరానికి విటమిన్ "డి" అందిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.
- లేలేత కిరణాల నుంచి వచ్చే సూర్యరశ్మి.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
- ఉదయం వచ్చే సూర్యరశ్మిలో నిత్యం ఉండడం ద్వారా.. మెరుగైన నిద్ర లభిస్తుందు.
మీ పూజగదిలో ఈ మార్పులు చేయండి - ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది!