Annavaram Kalyanotsavam 2024 : సుప్రసిద్ద పుణ్యక్షేత్రం అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు 45 కి.మీ. దూరంలో పంపా నది తీరాన రమణీయమైన ప్రకృతి అందాల మధ్య నెలకొని ఉంది. ప్రతి నిత్యం భక్తులతో రద్దీగా ఉండే సత్య దేవుని ఆలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతోంది.
స్థల పురాణం
పర్వతశ్రేష్ఠుడు అయిన మేరు పర్వతం ఆయన భార్య మేనకా దేవి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి విష్ణువు అనుగ్రహంతో రెండు పర్వతాలను పుత్రులుగా పొందుతారు. అందులో ఒకరు భద్రుడు, ఇంకొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసిన రత్నగిరి కొండగా మారుతాడు.
స్వప్న సాక్షాత్కారం
తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో ఆరెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసించే ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడికి, ఆ గ్రామాధికారి రాజా ఇనుగంటి వెంకట రామనారాయణ వారికి ఏకకాలంలో ఒకనాడు శ్రీమహావిష్ణువు కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియ, మఖ నక్షత్రం, గురువారం నాడు తాను రత్నగిరిపై వెలుస్తున్నానని, తనను శాస్త్ర నియమానుసారం ప్రతిష్టించి సేవించమని" చెప్పి అంతర్ధాన మయ్యారు.
అంకుడు చెట్టు పొదలో సత్యదేవుడు
మరుసటి రోజు బ్రాహ్మణుడు, రాజు ఇద్దరు కలిసి అన్నవరం వెళ్లి అక్కడ పొదల్లో వెతుకుతుండగా అంకుడు చెట్టు పొదలో స్వామి పాదాలపై సూర్య కిరణాలు ప్రసరిస్తుండగా చూసి, ఆ పొదలను తొలగించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకెళ్లి కాశీ నుంచి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా ప్రతిష్టించారు.
ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన ఆలయం
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. భక్తులు ఆలయాన్ని చేరుకోవడానికి 460 మెట్లున్నాయి. మెట్ల మార్గంలో వెళ్లలేని వారు ఘాట్ రోడ్లో ఆలయం వరకు వెళల డానికి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
రథాకారంలో ఉండే ఆలయం
సత్యదేవుని ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కుల్లో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కల్యాణ మండపం ఉంటుంది.
త్రిమూర్తి స్వరూపంగా పూజలందుకునే స్వామి
సత్యదేవుని ఆలయం రెండు అంతస్తుల్లో నిర్మించబడి ఉంటుంది. మొదటి అంతస్తులో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తిగా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏకవిగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజలందుకోవడం ఇక్కడి విశేషం.
ఆలయంలో జరిగే పూజలు
అన్నవరంలో ప్రతిరోజూ సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిరాటంకంగా జరుగుతుంటాయి. ఇక్కడకు వచ్చిన భక్తులు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు.
- వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు ఐదు రోజులు శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలు జరుగుతాయి.
- వైశాఖ శుద్ధ ఏకాదశిరోజు స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
- శ్రావణ శుద్ధ విదియ రోజు శ్రీసత్యనారాయణస్వామి జయంతి వైభవోపేతంగా జరుగుతుంది.
- ఇక ప్రతి పండుగకు ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి.
పరమ పవిత్రం అన్నవరం ప్రసాదం
తిరుపతి లడ్డు ఎంత ప్రసిద్ధి చెందిందో అన్నవరం ప్రసాదం కూడా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతికెక్కింది. విస్తరాకులో పొట్లం కట్టి ఇచ్చే అన్నవరం ప్రసాదం ఒక్కసారి తింటే మర్చిపోలేరు. కట్టెల పొయ్యి మీద గోధుమ నూక, బెల్లం, నెయ్యితో తయారు చేసే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం పరమ పవిత్రం. సత్యనారాయణ స్వామి ప్రసాదం మహిమ చెప్పనలవి కాదు. అందుకే సత్యనారాయణ స్వామి ప్రసాదం అడిగి మరి తీసుకుని తినాలని శాస్త్రం చెబుతోంది. తన ప్రసాదం స్వీకరించిన మాత్రాన్నే భక్తుల కోరికలు తీర్చే అన్నవరం సత్యనారాయణ స్వామిని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తీరాలి.
శుభకార్యాల దేవుడు
కొత్తగా ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేసినప్పుడు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. కొత్తగా వివాహం అయిన నూతన దంపతుల చేత తొలుత జరిపించే పూజ సత్యనారాయణ స్వామి వ్రతం. ఇక ప్రతి నెలా వచ్చే పౌర్ణమి, శుద్ధ ఏకాదశి వంటి తిథుల్లో, కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు విశేషంగా చేసుకుంటూ ఉంటారు.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
పెయింట్స్ లేని ఇంట్లో దరిద్ర దేవత తిష్ఠ- తులసి మొక్క బాధ్యత యజమానిదే! - Vastu Shastra Tips For Home