Akshaya Tritiya 2024 Date: హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు. ఇందుకోసం తప్పకుండా కొంతైనా బంగారం, వెండి కొనాలని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో.. అక్షయ తృతీయ ఎప్పుడు వస్తోంది? ఆ రోజున బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయి? అన్నది ఇప్పుడు చూద్దాం.
అక్షయ తృతీయ శుభముహూర్తం: తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతీ ఏడాది వైశాఖ మాసం శుక్ల పక్షం తదియ నాడు అక్షయ తృతీయ పండగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 10, 2024 శుక్రవారం ఉదయం 4:17 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే మే 11న తెల్లవారుజామున 2:50 గంటలకు ముగుస్తుంది. మే 10వ తేదీన శుక్రవారం ఉదయం 5:49 గంటల నుంచి మధ్యాహ్నం 12:23 గంటల వరకు అక్షయ తృతీయ శుభ సమయం ఉంటుంది. ఈ సమయంలో చేసే ఏ పని మొదలు పెట్టినా విజయం దక్కుతుందని పండితులు చెబుతారు.
పసిడి ప్రియులకు శుభవార్త: అయితే ఈ ఏడాది పసిడి, వెండి ధరలు ఊహలకు సైతం అందనంత భారీగా పెరిగాయి. దీంతో శుభకార్యాలు ఉన్న వారు తప్ప మిగిలిన వారు బంగారం కొనడానికి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతున్న వస్తున్న ధరలు తాజాగా తగ్గుముఖం పడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో అక్షయ తృతీయ పండగ ఉండటంతో.. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే పండగ రోజు పసిడి కొనేవారికి ఇది శుభవార్తే.
ఎందుకంటే అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారికి ఇది మంచి విషయమే. ఇక ప్రధాన నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే.. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.74వేల 619 ఉండగా, సోమవారం నాటికి రూ.320 తగ్గి రూ.74వేల 299కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.83వేల 395 ఉండగా, సోమవారం నాటికి రూ.132 తగ్గి రూ.83వేల 263కు చేరుకుంది.
బంగారం ఎందుకు కొంటారు?: అక్షయ తృతీయ అంటే అందరికీ బంగారం కొనడమే గుర్తుకు వస్తుంది. మరి ఎందుకు ఆ రోజు కొనుగోలు చేస్తారంటే.. ఆ రోజున బంగారం కొనుగోలు చేస్తే.. లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. అందుకే బంగారం కొనడం, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం చేస్తారు.