YSRCP Attack on TDP MLA Pulivarthi Nani : ఆంధ్రప్రదేశ్‌లోని సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నేతలు హింసాకాండ ను సృష్టించారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైఎస్సార్సీపీ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైఎస్సాప్సీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా నానిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. అలాగే ఆయన కారును సైతం ధ్వంసం చేశారు. ఈ దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
మారణాయుధాలతో వైఎస్సార్సీపీ గూండాలు : దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు మహిళా వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఓ కారులో వైఎస్సార్సీపీ జెండాలు, మద్యం బాటిళ్లు ఉండటంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో వైఎస్సార్సీపీ గూండాలు మారణాయుధాలతో యథేచ్ఛగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ ఘటనతో మహిళా వర్సిటీ ప్రాంగణం రణరంగంలా మారింది. భారీగా పోలీసు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి.
ఈవీఎంలు భద్రపరిచిన పద్మావతి మహిళా వర్సిటీలోనే వైఎస్సార్సీపీ శ్రేణులు దాడులకు తెగబడటంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. స్ట్రాంగ్‌రూమ్ పరిశీలన వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్ట్రాంగ్‌రూమ్ పరిశీలన కోసం వర్సిటీకి వచ్చిన తన తండ్రిపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడటంపై పులివర్తి నాని కుమారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తన తండ్రిపై దాడులు చేశారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడిలో పులివర్తి నాని డ్రైవర్‌తో సహా భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపారు.
ఓటరుపై దాడి ఘటన - తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై కేసు - CASE BOOKED ON TENALI MLA IN AP