YSRCP Leaders Attack on janasena Campaign vehicle 2024 : ఏపీలో ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పిఠాపురంలో పవన్‌కు మద్దతుగా సినీనటుడు సాయిధరమ్‌తేజ్ చేస్తున్న ప్రచారంలో అల్లరి మూకలు రాయి విసరడంతో ఓ జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కూటమి నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నిందితులను పట్టుకోకపోతే ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని తెలుగుదేశం నేత వర్మ హెచ్చరించారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాడిపర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేపట్టిన ఆయన మేనల్లుడు, సినీనటుడు సాయిధరమ్‌తేజ్ రోడ్‌షోలో వైఎస్సార్సీపీ అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డాయి. సాయిధరమ్‌తేజ్ లక్ష్యంగా రాయివిసరగా తాటిపర్తికి చెందిన జనసేన కార్యకర్త నల్లల శ్రీధర్ గాయపడ్డాడు. ఈ ఘటనతో తాటిపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
YSRCP Leaders Attack on Sai Daram Tej Roadshow : సాయిధరమ్‌తేజ్ ప్రచారం వేళ జనసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో గజ్జాలమ్మ కూడలికి చేరుకుని నినాదాలు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న వైఎస్సార్సీపీ శిబిరం నుంచి ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో తొలుత ఉద్రిక్తత ఏర్పడింది. సాయిధరమ్‌తేజ్ తాటిపర్తి కూడలిలో మాట్లాడి చినజగ్గంపేట వెళ్లగా ఆయన తిరిగి వచ్చేలోపు వైఎస్సార్సీపీ వర్గీయులు టపాసులు కాల్చి కవ్వింపు చర్యలకు దిగడంతో పాటు నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు సాగాయి.
ఈలోగా సాయిధరమ్‌తేజ్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుణ్ని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ దాడులకు పాల్పడుతోందని జనసేన, తెలుగుదేశం శ్రేణులు ఆరోపించాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుణ్ని పరామర్శించారు. నిందితులను అరెస్టు చేయకపోతే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌ను ముట్టడిస్తామని వర్మ హెచ్చరించారు.
"రోడ్‌షోలో పాల్గొన్న సాయిధరమ్‌తేజ్ లక్ష్యంగా దాడికి పాల్పడగా అడ్డుగా ఉన్న జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. గొడవ జరుగుతున్న సమయంలో లోకల్ ఎస్సై వారిని వారించి పంపించారు. అంటే ఈ ఘటనలో నిందితులు ఎవరు అనేది గొల్లప్రోలు ఎస్సైకి క్లారిటీగా తెలుసు. నిందితులను అరెస్టు చేయకపోతే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌ను ముట్టడిస్తాం." - వర్మ, టీడీపీ నేత