YS Vijayamma open letter on Family disputes : వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా తల్లి విజయమ్మ స్పందించారు. ఈ మేరకు వైఎస్సార్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదని వాపోయారు.
జరగకూడనివన్నీ తన కళ్ల ముందే జరిగిపోతున్నాయని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారన్నారు. అబద్ధాల పరంపర కొనసాగకూడదన్న విజయమ్మ, ఈ ఘటనలు తన పిల్లలిద్దరికే కాదు, రాష్ట్రానికీ మంచిది కాదని వ్యాఖ్యానించారు. దయచేసి తమ కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని, సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయొద్దని అందరికీ రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నానని కోరారు.
'వైఎస్ బతికి ఉండగానే ఆస్తులు పంచేశారన్నది అవాస్తవం. పిల్లలు పెరుగుతున్న రోజుల నుంచే కొన్ని ఆస్తులు పాప పేరు మీద, కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. వైఎస్ చేసింది పంపకం కాదు, కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే. విజయసాయి ఆడిటర్‌గా ఉన్నారు. ఆయనకు అన్నీ తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ఇంటి బంధువుగా ఎంవోయూపై సాక్షి సంతకం చేశారు. అమ్మగా నాకు ఇద్దరూ సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం. నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్ ఆజ్ఞ నిజం.
ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. బాధ్యత గల కుమారుడిగా జగన్ కుటుంబ ఆస్తులను సంరక్షించాలన్నది కూడా నిజం. వైఎస్ చివరి రోజుల్లో జగన్ ఆయనకు మాట ఇచ్చారు. నీ తర్వాత లోకంలో పాప మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని అని జగన్ వైఎస్‌కు మాట ఇచ్చారు. ఈ నిజం 'నాలో నాతో వైఎస్సార్' పుస్తకంలో ఎప్పుడో రాశా. వైఎస్సార్ బతికి ఉండగా ఆస్తులు పంచలేదు' అంటూ విజయమ్మ చెప్పుకొచ్చారు.