YCP Activists Attacked On TDP Activists : ఏపీలో నామినేషన్ల సందర్భంగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామపత్రాలు సమర్పించేందుకు తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని , వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఒకే సమయానికి వచ్చారు. కార్యాలయం నుంచి వెళ్తుండగా వైసీపీ మూకలు రెచ్చిపోయారు. తొలుత మోహిత్ రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్లారు.
ఆయన బయటకు వస్తుండగా పులివర్తి నాని లోపలికి బయల్దేరారు. ఈ క్రమంలో మోహిత్ రెడ్డి వెనుక ఉన్న కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీ జెండాలను కింద వేసి తొక్కారు. దీనిపై నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. సమీపంలో మురుగుకాల్వ నిర్మాణానికి ఉంచిన కంకర రాళ్లను విసిరారు. టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు.
పెట్రోల్‌తో వచ్చిన వైసీపీ కార్యకర్తలు: ఇరువర్గాల చర్యలతో ఆర్డీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. వాస్తవానికి ఆర్వో కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే ర్యాలీని ఆపేయాలన్న నిబంధన ఉంది.
కానీ వైసీపీ కార్యకర్తలు నిబంధనలు తుంగలోకి తొక్కి వాహనాలతో కార్యాలయం లోపలికి చొచ్చుకొచ్చేందుకు యత్నించారు. వాహన శ్రేణిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఓ వాహనంలో వైసీపీ కార్యకర్తలు పెట్రోల్ తీసుకొచ్చారని అక్కడున్నవారు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులను అడగ్గా వారు సమాధానాన్ని దాటవేశారు.
'మంత్రి పైనే ఆరోపణలు చేస్తావా'.. టీడీపీ కార్యకర్తపై దాడి.. పవర్ కట్ చేసిన పోలీసులు
TDP Candidate Pulivarthi Nani Fires On YCP : తాము వస్తున్నప్పుడే వైసీపీ అభ్యర్థి కూడా ముహూర్తం పెట్టుకున్నారని పులివర్తి నాని అన్నారు. నామినేషన్‌కు వస్తుంటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారని ఆరోపించారు. రోడ్డు బ్లాక్ చేసినా నడుచుకుని వచ్చి నామినేషన్ వేయాల్సి వచ్చిందని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత బెదిరించినా భయపడకుండా కార్యకర్తలు గట్టిగా పనిచేయాలని ఎవరూ భయపడొద్దని అన్నారు. వైసీపీ వాళ్లు రాళ్లు వేస్తే పోలీసులు టీడీపీ కార్యకర్తలను తీసుకెళ్లారని పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాస్కర్‌రెడ్డి కుట్రలకు భయపడే పరిస్థితి లేదని ఈ 15 రోజులు ఎంత రెచ్చగొట్టినా దెబ్బలు తినేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని పులివర్తి నాని అన్నారు.
వైసీపీ నేతల విధ్వంసం - దళితులపై దాడి చేసి, గుడిసెలకు నిప్పుపెట్టిన ఎమ్మెల్యే అనుచరులు