Amit Shah Election Campaign In Wanaparthy : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విరోధ పార్టీ అని అంబేడ్కర్‌ను అవమానపరిచిందని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. ఎన్డీఏ వచ్చాక ఎస్టీ వ్యక్తిని రాష్ట్రపతిని చేశామని గుర్తుకు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీల బడ్జెట్ రూ.41 వేల కోట్లుగా ఉందని ఇప్పుడు బీజేపీ హయాంలో ఎస్సీల బడ్జెట్‌ను రూ.1.85 లక్షల కోట్లుగా పెంచామని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి భరత్‌కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
Bjp Election Campaign : కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూల్ వరకు జాతీయ రహదారిగా చేస్తున్నామని తెలిపారు. కృష్ణానదిపై సోమశిల వద్ద రూ.1100 కోట్లతో ఐకాన్ వంతెన నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. అచ్చంపేటలో పర్యాటక రంగం అభివృద్ధికి కృషిచేస్తున్నామని అన్నారు. తెలంగాణలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని బీజేపీని 10 సీట్లలో గెలిపిస్తే ముస్లింల రిజర్వేషన్లు ఎత్తివేస్తామని తెలిపారు. తొలగించిన రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందిస్తామన్నారు. తనకి సంబంధించి మార్ఫింగ్ వీడియో ద్వారా కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు.
బీజేపీ హయాంలో ఎస్సీలకు న్యాయం : ఎస్సీల పక్షాన మోదీ ఉన్నారని ప్రజలు నమ్ముతున్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ హయాంలో ఎస్సీలకు న్యాయం చేశామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. ఈ ఎన్నికలు రాహుల్ బాబా, నరేంద్ర మోదీ మధ్య ఎన్నికలని అయోధ్యలో రామ మందిరం అంశాన్ని 70 ఏళ్లుగా కాంగ్రెస్ నాన్చుతూ వచ్చిందని ద్వజమెత్తారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో రామ మందిరం నిర్మించారని గుర్తుకు చేశారు. ప్రాణప్రతిష్ఠలో కూడా కాంగ్రెస్ నేతలు పాల్గొనలేదని తెలిపారు. ఓటు బ్యాంకుకు భయపడి రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు రాహుల్ రాలేదన్నారు.
రాహుల్ ఓటు బ్యాంకుకు భయపడి రామమందిర ప్రాణప్రతిష్ఠకు రాలేదు. మోదీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుతాయి. కాంగ్రెస్ గ్యారంటీలు చైనా గ్యారంటీ మాదిరిగా పూర్తికావు. రైతులకు ఏటా రూ.15 వేలు ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు. కౌలురైతులకు ఏటా రూ.12 వేలు ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు. రైతుల పంటలకు రూ.500 బోనస్ హామీ అమలు చేయలేదు. విద్యార్థులకు రూ.5 లక్షల రుణం హామీ నెరవేర్చలేదు. కళాశాల విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని మోసగించారు.- అమిత్ షా, కేంద్రహోంశాఖ మంత్రి