Story On New PCC President Chair : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన మహేశ్ కుమార్ గౌడ్ గాంధీభవన్ రూపురేఖలు మార్చేస్తున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా గాంధీభవన్‌లో మరమ్మతుల ప్రక్రియ కొనసాగుతోంది. గాంధీభవన్ అంతా రంగులు వేసే కార్యక్రమం నడుస్తోంది. అక్కడక్కడ పెచ్చులు ఊడి ఉన్న గోడలకు మరమ్మతులు చేస్తున్నారు. పదుల సంఖ్యలో కూలీలు మరమ్మతుల కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈ నెల 15వ తేదీన మహేశ్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. ఆ రోజుకు గాంధీభవన్ మరమ్మతులు పూర్తి చేయాల్సి ఉందని గాంధీభవన్ ఇంఛార్జి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పుడు గాంధీభవన్‌లో దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేసి మరమ్మతులు చేశారు. గాంధీభవన్‌లో పడమటి దక్షిణ వైపు పూర్తిగా ఇంటీరియర్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఏఐసీసీ నాయకులకు ఒక ఛాంబర్, సమావేశాలు నిర్వహించేందుకు ఒక ఛాంబర్, వర్కింగ్ ప్రెసిడెంట్లకు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీకి ఓ ఛాంబర్, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌కు ఒక ఛాంబర్, పీసీసీ అధ్యక్షుడికి ఒక ఛాంబర్, యాంటీ రూమ్, ఇంటీరియర్ పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దారు.
ఆ కుర్చీపైనే ఎక్కువగా పార్టీ కార్యకర్తల్లో చర్చ : అదే విధంగా పాడైన గేట్లు కొత్తవి ఏర్పాటు చేయించారు. గాంధీభవన్ ప్రాంగణం ముందు వైపు పూర్తిగా సిమెంట్‌తో కాంక్రీట్ వేయించారు. దాదాపు అన్ని గదులకు ఏసీలు ఏర్పాటు చేయించారు. ఇప్పుడు తాజాగా ఇటువైపు ప్రవేశ ద్వారం దగ్గర నుంచి ఉన్న అన్ని రూమ్‌లకు రంగులు వేయిస్తున్నారు. అందులోని ఫర్నీచర్ మార్చడం, ఫ్యాన్‌లు మార్చడం, పని చేయని ఏసీల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లాంటి పనులు కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకు సంస్థాగత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగిన మహేశ్ కుమార్ గౌడ్‌కు మీడియా హాల్ ఎదురుగా ఉన్న గది కలిసొచ్చింది. అక్కడ ఆయన వేసుకున్న కుర్చీ కూడా తనకు పదవులు వచ్చేందుకు దోహదం చేసిందన్న భావన ఆయనలో వ్యక్తం అవుతోంది. సెంటిమెంట్ ఆధారం చేసుకుని అదే కుర్చీని పీసీసీ అధ్యక్షుడి గదిలోకి మార్చుకోనున్నారు. ఆ కుర్చీలో కూర్చొన్న తరువాతనే అసెంబ్లీ ఎన్నికలు జరగడం, పార్టీ అధికారంలోకి రావడం, ఎమ్మెల్సీ పదవి రావడం, తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ఆయన ఆ కుర్చీని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. దీంతో ఆ కుర్చీపైనే ఎక్కువగా పార్టీ కార్యకర్తల్లో చర్చ కొనసాగుతోంది.
గాంధీభవన్ మరమ్మతులు పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దుతున్న పీసీసీ త్వరలో ఇందిరాభవన్ కూడా ఏపీ పీసీసీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు చొరవ చూపుతోంది. ఆ భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లయితే అనుబంధ విభాగాలకు కేటాయింపులు చేసేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నిమిత్తం వార్ రూమ్ కింద, మీడియా సమావేశాలు నిర్వహణకు ఆ భవనాన్ని వాడుకున్నారు అయినా కూడా తెలంగాణ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోంది.