Three MPs resign from YSRCP : ఓ వైపు ముహూర్తం ముంచుకొస్తోంది. ఎన్నికల కదన రంగాన పాంచజన్యం పూరించే సమయం సమీపించింది. మరో వైపు బలమైన ప్రత్యర్థులు. మార్పు ఖాయమనే వేగుల సంకేతాలు. ఈ నేపథ్యాన తాడేపల్లి ప్యాలెస్లో వాతావరణం వేడెక్కింది. విజయమే లక్ష్యంగా, ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే ప్రతి వ్యూహాల రూపకల్పనలో చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. కానీ, ఎవరి లెక్కలు వారివే. అధిష్ఠానం ఒకటి ఆదేశిస్తే, అభ్యర్థులు మరోటి ఆశిస్తున్నారు. ఇరువురి నడుమ సంధి కుదరడం లేదు. సయోధ్యకు తావు లేని తరుణంలో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఫలితంగా వైఎస్సార్సీపీలో రాజీనామాల పర్వం రక్తి కట్టిస్తోంది. రోజుకొక్కరు చొప్పున పార్టీకి దూరమవుతున్న పరిస్థితి నెలకొంది.
సన్నిహితులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యుల్లాంటి వారు సైతం జగన్ వైఖరిని భరించలేక ఒక్కొక్కరుగా వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. వైసీపీ ఇప్పటివరకు నాలుగు విడతలుగా అభ్యర్థుల జాబితా వెల్లడించింది. మూడు జాబితాల్లో 51మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలకు స్థానచలనం కల్పించింది. ముగ్గురు ఎంపీలు, 24మంది ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపించింది.
వైఎస్సార్సీపీ ఐదో జాబితాపై జగన్ కసరత్తు - సీట్లెవరివో, పాట్లెవరికో!
ముగ్గురు ఎంపీల రాజీనామా : ఇన్చార్జి పదవి నుంచి తప్పించడంతో మనస్థాపానికి గురైన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ పెద్దల నిర్ణయంతో తాను ఎంపీ పదవికీ, వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో ఇప్పటికీ వలసలు, ఆత్మహత్యలు కొనసాగుతుండడం బాధకలిగిస్తోందని చెప్పారు. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి కోసం ప్రయత్నించడంతో పాటు తన పరిధిలో ఉన్నంత వరకు అన్ని పనులు చేశానని తెలిపారు.
చిచ్చురేపిన విందు : ఆ తర్వాత కొద్ది రోజులకే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యం లేదన్న బాలశౌరి అధిష్ఠానంపై చేసిన పలు ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఇచ్చిన విందు పార్టీలో దూరం పెరిగేందుకు కారణమైందని వివరించారు. ఇదిలా ఉండగా మచిలీపట్నం వదిలి నరసరావు పేట నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించడం పొమ్మన లేక పొగపెట్టినట్లుగా ఉందని బాలశౌరి భావించారు. ఈ నేపథ్యంలో తాను జనసేనలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం.
మమ్మల్ని కాదని వస్తారా- వైసీపీలో మొదలైన తిరుగుబాటు! కాళ్లబేరానికి సిద్ధమైన అధిష్ఠానం
అందుకే రాజీనామా : తాజాగా అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా చేశారు. దీంతో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఎంపీల సంఖ్య మూడుకు చేరింది. లావు శ్రీకృష్ణదేవరాయులును గుంటూరులో పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించడం అసంతృప్తికి కారణమైంది. పార్టీలో అనిశ్చితి ఏర్పడిందన్న శ్రీకృష్ణదేవరాయులు.. ఇది మంచిది కాదని అన్నారు. తన స్థానంలో వేరొకరిని పోటీ చేయించాలని అధిష్ఠానం భావించడం సరికాదని, అభ్యర్థి మార్పు విషయమై క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నందున తాను రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
వైఎస్సార్సీపీ అధిష్ఠానం ఇప్పటి వరకు తొమ్మిది మందికి స్థాన చలనం కల్పించగా వారిలో ముగ్గురు రాజీనామా చేశారు. మరో రెండుమూడ్రోజుల్లో తుది జాబితా వెల్లడించనున్న నేపథ్యంలో ఇంకెంత మంది పార్టీని వీడతారో అని క్యాడర్ అయోమయంలో పడింది.