Congress Estimation on Lok Sabha Results 2024 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటిన కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు సాధించేలా ప్రణాళికతో పనిచేసింది. కనీసం 14 స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు పోయింది. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఒక్కో స్థానం చొప్పున మూడు పోయినా, మిగిలిన 14 స్థానాలు తమ ఖాతాలో పడతాయన్న ధీమా పీసీసీలో వ్యక్తమవుతోంది.
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఎక్కువగా కనిపించినప్పటికీ, సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్‌కు ఎక్కువగా మద్దతు లభించినట్లు అంచనా వేస్తోంది. బూత్ ఏజెంట్లు, క్షేత్రస్థాయి నాయకుల ద్వారా పోలింగ్ సరళిని రాష్ట్ర నాయకత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఓట్ల అంచనా వేసుకున్న హస్తం పార్టీ డబుల్ డిజిట్ రావడం ఖాయమనే విశ్వాసంతో ఉంది.
Telangana Lok Sabha Election Results 2024 : రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, భువనగిరి, జహీరాబాద్, ఆదిలాబాద్ సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి, హస్తం పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌ల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు భావిస్తున్నాయి. ఇక్కడ మైనారిటీలు, మున్నూరుకాపులతోపాటు బీసీల ఓట్లు తమకు అనుకూలంగా పడడంతో దానం నాగేందర్ గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మల్కాజిగిరిలో ముక్కోణపు పోటీ : ఇక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి మధ్య ముక్కోణపు పోటీ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మల్కాజిగిరి పరిధిలో ఉన్న ఆంధ్ర, తెలంగాణకు చెందిన ఓటర్లు, పోలింగ్ కోసం వారి సొంతూళ్లకు వెళ్లడం సైతం సానుకూల అంశంగా కాంగ్రెస్ భావిస్తోంది.
చేవెళ్లలో సిటింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మధ్య గట్టి పోటీ ఉన్నట్లు హస్తం పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయినప్పటికీ తక్కువ మెజారిటీతో బయట పడతామన్న ధీమా మాత్రం కాంగ్రెస్ వర్గీయుల్లో కనిపిస్తోంది. మెదక్‌లో బీఆర్ఎస్, కమలం పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థి మధ్య త్రికోణ పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ ఉన్న మహబూబ్‌నగర్‌లో డీకే అరుణపై గెలుపు అంత సులువు కాదన్న భావన వ్యక్తమవుతోంది. అయితే, కొడంగల్, జడ్చర్ల, షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ వస్తే గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తున్నారు.
కరీంనగర్, నిజామాబాద్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆశలు వదులుకున్నట్లు స్పష్టం అవుతోంది. నిజామాబాద్‌లో తాను గెలిస్తే అది అద్భుతమేనని జీవన్‌రెడ్డి సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా శ్రమించినప్పటికీ, కరీంనగర్‌లోనూ చుక్కెదురయ్యే పరిస్థితి కసిపిస్తోంది. అక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ బరిలో ఉండడం, హస్తం పార్టీ అభ్యర్థి ప్రకటనలో జరిగిన జాప్యం వల్ల వెనుకబడినట్లు అంచనా వేస్తున్నారు. ఐదు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలు ఎవరిని పార్లమెంట్‌కు పంపుతాయో వేచి చూడాల్సి ఉంది.
కొత్త పీసీసీ చీఫ్ కోసం కాంగ్రెస్ వేట - రేసులో కీలక నేతలు! - TELANGANA PCC NEW CHIEF 2024
జూన్ 1న 'ఇండియా' కూటమి సమావేశం- ఎజెండా అదే! మమత రెస్పాన్స్‌పై సస్పెన్స్! - LOK SABHA ELECTIONS 2024