TG Congress Nominated Posts Issue : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మార్చి 15వ తేదీన 37మంది నాయకులను కార్పొరేషన్ల ఛైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వారు ఛైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించలేదు. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిశాక బాధ్యతలు తీసుకునే సమయానికి నామినేటెడ్ పోస్టుల విషయంలో పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
దీపాదాస్ మున్షీ వద్దకు చేరిన పంచాయతీ : అనర్హత కలిగిన వారికి అవకాశం కల్పించారని ఏఐసీసీకి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలియడంతో ఆ 37మంది జాబితాను ప్రక్షాళన చేయాలని పీసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో నియమితులైన ఛైర్మన్ల విషయంలో తమకు తెలియకుండా ఏవిధంగా నియమిస్తారని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ వద్ద పంచాయతీ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయా మంత్రులు, సీనియర్ నాయకుల అభ్యంతరాలు తీసుకున్న దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఛైర్మన్లు ఎవరు బాధ్యతలు తీసుకోకుండా తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం
అయిల్ సీడ్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన జంగారాఘవరెడ్డి తన స్థాయికి తగిన పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్టేట్ ఇరిగేషన్ డెవలెప్‌మెంట్ కార్పోరేషన్ కాదు ఎమ్మెల్సీగా చేయాలని కొల్లాపూర్‌కు చెందిన జగదీశ్వరరావు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. కుడా ఛైర్మన్‌గా నియమితులైన వెంకటరామిరెడ్డిపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Nominated Posts in Telangana : శాతవాహన అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా నరేందర్‌రెడ్డి నియామకంపై కరీంనగర్‌కు చెందిన ఎమ్మెల్యేలతోపాటు స్థానిక మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఓ మహిళ నాయకురాలు తనకు ఇచ్చిన పదవి వద్దని ఎమ్మెల్సీ కావాలని రాష్ట్రనాయకత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ తరుణంలో 37మంది ఛైర్మన్ల జాబితాను ప్రక్షాళన చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఛైర్మన్ల పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఛైర్మన్ల పోస్టుల భర్తీ మరికొంత ఆలస్యం : ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీకి పనిచేసిన వారి జాబితా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరింత సమగ్రంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఛైర్మన్ల పోస్టుల భర్తీ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రక్షాళన చేసే వరకు ఎవ్వరు కూడా బాధ్యతలు తీసుకునేందుకు అవకాశం లేదని వెల్లడిస్తున్నాయి.