TDP JANASENA BJP MANIFESTO RELEASED: తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్ధార్థ్నాథ్ సింగ్ విడుదల చేశారు. మూడు పార్టీలకు వచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలతో మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. ఏపీ భవిష్యత్తు కత్తి మొన మీద వేలాడుతోందని, గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అశాంతి, అరాచకమే ఉందని నేతలు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు జగన్ పేదలకు 10 రూపాయలు ఇచ్చి, 100 రూపాయలు కొట్టేశారని దుయ్యబట్టారు. పోలవరం, నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచారని మండిపడ్డారు. అన్నక్యాంటీన్లు సహా వివిధ సంక్షేమ పథకాలను రద్దు చేశారని తెలిపారు. సగటున ప్రతి కుటుంబంపై 8 లక్షల మేర అప్పు ఉందని, అన్ని వర్గాలను జగన్ నాశనం చేశారన్నారు. విధ్వంస పాలన సాగనంపాలని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం వంటివి ఇప్పటికే ప్రకటించామన్నారు. సమగ్ర ఇసుక విధానం అమలు చేస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని పవన్ స్పష్టం చేశారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతామని తెలిపారు.
బీజేపీ దేశ స్థాయిలో ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం - జనసేన ప్రకటించే మేనిఫెస్టో కు బీజేపీ మద్దతు, సంపూర్ణ సహకారం ఉంటాయని స్పష్టం చేశారు. తెలుగుదేశం - జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశామని బీజేపీ సూచనలు కూడా జోడించామన్నారు. ప్రజలను గెలిపించేందుకే తమ కలయిక అని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే తామంతా సర్దుబాటు చేసుకున్నామని వివరించారు. 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించి, నెలకు 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం సహా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. తల్లికి వందనం కింద ఒక్కో బిడ్డకు 15 వేలు ఇస్తామని ప్రకటించారు. స్కిల్ గణన చేపడతామని, ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలు ఇస్తామన్నారు. 10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ మీదే తొలి సంతకమని స్పష్టం చేశారు.
TDP Bus Yatra: రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్న టీడీపీ చైతన్య రథయాత్రలు..
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లల్లో 1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వడం సహా బీసీ కార్పోరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేస్తామని వెల్లడించారు. బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి 10 వేల కోట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఆధునిక పని ముట్లతో ఆదరణ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పవర్ లూం, హ్యాండ్ లూంలకు కొంత మేర ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. మత్స్యకారులను ఆదుకుంటామని తేల్చిచెప్పారు. సంపద సృష్టిస్తూ ఆదాయాన్ని పంచుతామని ప్రకటించారు.
సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు, బీసీలకు 50 ఏళ్లకే పింఛను, యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు వంటివి ఇప్పటికే ప్రకటించారు.
అదే విధంగా సామాజిక పింఛను 2024 ఏప్రిల్ నుంచే వర్తిస్తుందని తెలుగుదేశం ప్రకటించింది. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి, తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఏడాదికి రూ.15 వేల ఆర్థికసాయం, రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం, వాలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు ఇప్పటికే ప్రకటించారు.
TDP Manifesto 2024: 'టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల్లో వణుకుమొదలైంది'