Supreme Court Stay On Telangana MLC Election : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది.
తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యానారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని వాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం, ప్రభుత్వ విధి అని గుర్తు చేసింది.
తమ నియామకాన్ని పక్కన పెట్టి, కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పిటిషన్‌పై విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం, గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా, సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని స్పష్టంచేసింది.