Congress Leaders Reaction on KCR Comments : కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిప్పికొట్టారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు, కృష్ణా జలాల కేటాయింపులు, విద్యుదుత్పత్తి, కోనుగోళ్లు, సరఫరా, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ పదేపదే అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి 12వేల మెగావాట్లకు పెంచామని కేసీఆర్ చెప్పడంలో వాస్తవం లేదని ధ్వజమెత్తారు.
"ఏడు వేల మెగావాట్ల నుంచి 19 వేల మెగావాట్లు చేశామని అంటారు. ఇది అంతా పచ్చి అబద్ధం. నేను ఆన్ రికార్డు చెబుతున్న కేసీఆర్ పదేళ్ల హయాంలో వాళ్లు మొదలుపెట్టి పూర్తి చేసింది భద్రాద్రి పవర్ ప్రాజెక్టు. దాన్ని కూడా అవుట్ డేటెడ్ టెక్నాలజీ తీసుకువచ్చి 30 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలపై, వినియోగదారులపై భారం మోపిపోయారు. ప్రపంచమంతా లేటెస్ట్ టెక్నాలజీని వాడుతుంటే మనం మాత్రం ఓల్డ్ టెక్నాలజీని వాడాం." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి
కేసీఆర్ అధికారంలో ఉండగానే కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి ఇప్పుడు మరమ్మత్తు చేస్తామనడం హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్ కుమార్ విమర్శించారు. కమీషన్లు కోసం కేసీఆర్ కుటుంబం కక్కుర్తి వల్లే ఆనకట్టలో లోపాలు వచ్చాయని ఆరోపించారు. ప్రాజెక్టు కుంగిన తర్వాత గత ప్రభుత్వమే నీటిని వదిలేసి కాంగ్రెస్ సర్కార్‌పై నింద మోపడం ఏమిటని నిలదీశారు. కాళేశ్వరం మీద ఇప్పటికే రూ.95 వేల కోట్లు ఖర్చు చేశారని పూర్తయ్యే నాటికి రూ.1.50 లక్షల కోట్లు అవుతుందని వివరించారు.
"మేడిగడ్డ బ్యారేజీ 21వ తేదీ అక్టోబరు 2023న కూలిపోయింది. మరి నాడు ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే డిసెంబరు 7వ తేదీన. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు కేసీఆర్ నోరు మెదపలేదు. మీ అసమర్థత, అవినీతి, కమీషన్ల కక్కుర్తి వల్లనే మేడిగడ్డ, కాళేశ్వరం కూలిపోయాయి. ఈ రాష్ట్రానికి పూర్తిగా గుదిబండగా మారింది." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి
కాంగ్రెస్ పెండింగ్ లోక్‌సభ స్థానాల జాబితా విడుదల - ఖమ్మం నుంచి పొంగులేటి వియ్యంకుడు
కేసీఆర్, జగన్ దోస్తీ : నీటి కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో కంటే బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ దుయ్యబట్టారు. కేసీఆర్ అసమర్థత వల్లే తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీ కేటాయింపు జరిగిందని విమర్శించారు. 70 శాతం పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ 555 టీఎంసీలు రావాలని కృష్ణా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు.కేసీఆర్, జగన్ దోస్తీతోనే నీటి దోపిడి జరిగిందని ఆరోపించారు.
గత ప్రభుత్వంలో కంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలు పెట్టడంతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే 9.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రతి గింజనూ కొంటామని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన డిండి, ఎస్ఎల్బీసీ టన్నెల్, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెళ్లంల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చివరి దశలో ఉందని లోక్‌సభ ఎన్నికల అనంతరం కనుమరుగవటం ఖాయమని జోస్యం చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్‌లో విస్తుపోయే విషయాలు : ప్రగతి భవన్ ప్యాలెస్ నుంచి చిన్న ఇంట్లోకి వెళ్లడంతో కేసీఆర్‌కు మతిపోయినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ అధినేత పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. మానేరు పనులు చేసిన కాంట్రాక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా పదేపదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణలో బయటపడుతున్న అంశాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయని వెల్లడించారు.