PM Modi At Sangareddy BJP Public Meeting Today 2024 : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం రోజున ఆదిలాబాద్ నుంచి రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. ఇక ఈరోజు సంగారెడ్డి నుంచి రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని నమ్ముతామన్న మోదీ, బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసర్చ్ కేంద్రం (Begumpet Civil Aviation Research Center) ఏర్పాటు చేశామని చెప్పారు.
PM Modi On Telangana Development : సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలో పర్యటించిన మోదీ రూ.9,021 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ (PM Modi At BJP Vijaya Sankalp Sabha)లో పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే మొదటి సివిల్ ఏవియేషన్ రీసర్చ్ కేంద్రాన్ని బేగంపేటలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్, తెలంగాణకు గుర్తింపు వస్తుందని అన్నారు. ఏవియేషన్ కేంద్రం స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణకు వేదికగా నిలుస్తుందని వివరించారు.
'కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు - ప్రభుత్వం మారినా పాలనలో మార్పు లేదు'
పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైంది. పలు కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ పనులు చేపట్టాం. ఘట్‌కేసర్-లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలు సర్వీసు మొదలైంది. పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు పారాదీప్-హైదరాబాద్ పైప్‌పైన్ పనులు చేపట్టాం. తక్కువ ఖర్చుతో పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు వీలు కలుగుతుంది. దేశంలోని 140 కోట్ల ప్రజలు వికసిత్ భారత్ నిర్మాణానికి సంకల్పం చేపట్టారు. వికసిత్ భారత్ కోసం ఆధునిక మౌలిక సౌకర్యాల కల్పన ఆవశ్యకం. మౌలిక సౌకర్యాల కోసం దేశ బడ్జెట్‌లో 11 లక్షల కోట్లు కేటాయించాం. సంగారెడ్డి నుంచి మదీనగూడ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య అనుసంధానత ఏర్పడుతుంది. తెలంగాణ దక్షిణ భారత్‌కు గేట్‌వేలా నిలుస్తుంది. - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
Kishan Reddy At Sangareddy BJP Vijaya Sankalp Sabha 2024 : అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కేంద్రం రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. బీజేపీ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో జాతీయ రహదారులు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. పదేళ్లలో మరో 2500 కి.మీ మేర జాతీయరహదారుల నిర్మాణం జరిగిందని వెల్లడించారు. కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ జరిగిందన్న కిషన్‌రెడ్డి, రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు కేంద్రం చేపట్టిందని వివరించారు.
ఇప్పటికే 3 వందేభారత్ రైళ్లు, ఎన్టీపీసీ థర్మల్ ప్లాంటను కేంద్రం మంజూరు చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు కోసం సర్వే జరుగుతోంది. తెలంగాణకు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. వచ్చే ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీయే ప్రధాన మంత్రి కావాలని యావత్ దేశం భావిస్తోంది, మోదీని భారతీయులంతా తన కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి రావడం పక్కా, దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో మోదీ నడిపిస్తారనడం పక్కా. - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం : ప్రధాని మోదీ
ఒకే వేదికపై పీఎం మోదీ, సీఎం రేవంత్ - కోలాహలంగా ఆదిలాబాద్ బహిరంగ సభ