PCC Estimation On Telangana Lok Sabha Election Result : రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందన్నదానిపైనే చర్చ జరుగుతోంది. 14 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం పని చేసింది. అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరగడం, ఆ తర్వాత కూడా కొందరు అభ్యర్థులు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేదు. అధికార పార్టీ కదా ఊపుంటుందని సునాయాసంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్న అభ్యర్థులు కొందరు ప్రచారం చేయడంపై జాప్యం చేశారు. అప్పటికే బీజేపీ, బీఆర్ఎస్లు ప్రచార జోరును పెంచి కాంగ్రెస్ కంటే ముందున్నాయి.
PCC Estimate Winning Seats Telangana : టికెట్లు ఖరారు కాగానే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రచార వేగాన్ని పెంచినా కూడా కొన్ని నియోజక వర్గాల్లో ప్రత్యర్థి అభ్యర్థులతో పోటీ పడలేకపోయారన్న భావన పీసీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదే కొంపు ముంచినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. 17 లోక్‌సభ నియోజక వర్గాల్లో 64 సభలు, కార్నర్ సమావేశాలు, రోడ్ షోలతో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు.
'ఎక్కువ సీట్లు వచ్చేవి మాకే' - గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా - Leaders Prediction on Elections
బీజేపీ విమర్శలను తిప్పికొట్టిన సీఎం రేవంత్ రెడ్డి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు జాతీయ స్థాయి బీజేపీ నాయకులు రాష్ట్రానికి రోజు మార్చి రోజు వస్తుండడం వల్ల ఆ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుని దీటుగా తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం గట్టిగా ప్రయత్నించింది. 400 స్థానాల్లో విజయం సాధించాలని కమలం పార్టీ ప్రచారం చెయ్యడమంటే రిజర్వేషన్ల రద్దు కోసమేనని ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు ప్రయత్నిస్తుందని రేవంత్ రెడ్డి ఆధారాలతో చేసిన విమర్శలు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. రేవంత్ రెడ్డిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా విమర్శనాస్త్రాలతో బీజేపీ దూకుడును సమర్థంగా అడ్డుకోగలిగినట్లు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఇవే : ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ నాయకులు అంచనాలలో మునిగి తేలుతున్నారు. పోలింగ్ సరళి, పోల్ మేనేజ్‌మెంట్, క్షేత్ర స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు దగ్గర నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా డబుల్ డిజిట్ గ్యారంటీ అని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, భువనగిరి, నాగర్ కర్నూల్, జహీరాబాద్, అదిలాబాద్ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయని రాష్ట్ర నాయకత్వం పూర్తి విశ్వాసంతో ఉంది. చేవెళ్ల, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ స్థానాలు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి.
BJP Winning Seats Chances in Lok Sabha 2024 : హైదరాబాద్ ఎంఐఎం కైవసం చేసుకుంటుండగా కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరిలు బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గట్టి పోటీ ఉన్న స్థానాల్లో ఒకట్రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డా కూడా డబుల్ డిజిట్ హస్తం పార్టీ చేజిక్కించుకోవడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బీజేపీ గట్టి పోటీ ఇస్తుండడంతో కేంద్రంలో మోదీ సర్కారు వచ్చినట్లయితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సీనియర్ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.
Telangana Lok Sabha Elections 2024 : ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఉత్తర భారతదేశంలో బీజేపీపై జనాలు నమ్మకం కోల్పోతున్నందున ఇండియా కూటమి విజయం సాధించి ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుని, కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పడినట్లయితే రాష్ట్రానికి ఎక్కడ లేని ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కావాల్సినన్ని నిధులు కూడా తెలంగాణకి వస్తాయని అంచనా వేస్తున్నారు.