Parties Focus on Malkajgiri : రాష్ట్రంలో మినీ ఇండియాగా భావించే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోరు హోరా హోరీగా ఉండబోతుంది. 38 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎవరికి వారే గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు పెంచారు. వ్యూహ, ప్రతివ్యూహాలతో మల్కాజిగిరిలో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.
Lok Sabha Elections 2024 : ఒకవైపు అధికార పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే ఇటీవల శాసనసభ ఎన్నికల్లో 7 అసెంబ్లీ సీట్లను క్వీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ మరోసారి అదే ఫలితాన్ని అందుకోవాలని చూస్తోంది. కాషాయదళం కూడా మరోసారి మోదీ మంత్రంతో గెలిచి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇలా మూడు పార్టీలు (Lok Sabha Polls 2024)మల్కాజిగిరిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు - పార్టీలు మారుతున్న నేతలు
స్వయంగా రంగంలోకి దిగిన రేవంత్‌రెడ్డి : మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ విజయఢంకా మోగించగా మరోసారి జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ సారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం గత ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గెలుపొందిన నియోజకవర్గం కావడంతో హస్తం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టున్న మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు కోసం ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని 7 స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటీ గెలుచుకోలేదు. అదే ఇప్పుడు హస్తం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ఈ నియోజకవర్గం స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించినా శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం పెద్ద సవాల్‌గా మారింది. మరోవైపు పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి స్థానికురాలు కాదనే ప్రచారం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేటీఆర్ : ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం మల్కాజిగిరిపై గులాబీ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను గెలుచుకున్న కారు పార్టీ, మల్కాజిగిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపింది. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన ఆయన స్థానిక నినాదం ఎత్తుకుని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు స్థానికేతరులంటూ ప్రచారం మొదలుపెట్టారు. భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) సైతం ఇక్కడ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని హస్తం పార్టీకి సవాల్ విసిరారు.
ఇందులో భాగాంగా కేటీఆర్ మాజీ మంత్రి మల్లారెడ్డితోపాటు గెలిచిన ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కానీ కేటీఆర్ మాత్రం మల్కాజిగిరిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు తొమ్మిదిన్నర లక్షల ఓట్లు సాధించిన గులాబీ పార్టీ అవే ఓట్లు లోక్‌సభ ఎన్నికల్లోనూ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే శాసనసభ ఎన్నికల్లో ఉన్న పాజిటివ్ ఓటింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందా? అనే అనుమానం భారత్ రాష్ట్ర సమితి నేతల్లో వ్యక్తమవుతోంది.
నిజామాబాద్‌లో కుల రాజకీయాలు - ఎంపీ సీటుపై ప్రధాన పార్టీల గురి
మల్కాజిగిరిపై బీజేపీ ఫోకస్ : మల్కాజిగిరిని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోన్న పార్టీల్లో బీజేపీ సైతం అగ్రస్థానానే నిలిచింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ పదే పదే నినదిస్తున్న కమలం పార్టీ ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాటు చేసి ఉత్తర భారత దేశానికి చెందిన ఓటర్లను ఆకట్టుకుంది. ఈసారి మెజార్టీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రంలో కీలకపాత్ర పోషించవచ్చని భావిస్తోంది. మల్కాజిగిరి స్థానాన్ని కైవసం చేసుకుంటే తెలంగాణపై పట్టు సాధించవచ్చని చూస్తోంది.
అందుకే బీజేపీలో ప్రధాన నేతగా ఉన్న ఈటల రాజేందర్‌ను (Etela Rajender) మల్కాజిగిరి బరిలోకి దింపింది. ఇప్పటివరకు ఇక్కడ కాషాయ జెండా ఎగరకపోవడంతో ఈసారి కచ్చితంగా గెలిచి తీరాలనే కసితో పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోవడంతో ఇక్కడ కమల పార్టీ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత మూడు ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన భారతీయ జనతా పార్టీ మోదీ మానియాతో ఈసారి గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. మల్కాజిగిరి మాదంటే మాదంటూ తలపడుతున్న ప్రధాన పార్టీల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠ నెలకొంది.
సార్వత్రిక సమరం 2024 - నేతల ఘాటు విమర్శలతో వేడెక్కిన రాజకీయం - Lok Sabha Election 2024