Mahbubnagar Lok Sabha Results : మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం ఫలితం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. మహబూబ్‌నగర్ స్థానంలో 31మంది అభ్యర్ధులుండగా, కాంగ్రెస్ పార్టీ తరఫున వంశీచంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి ఆఖరి వరకు కమలం ఆధిక్యాన్ని కనబరించింది.
స్వల్ప మెజారిటీతో డీకే అరుణ విజయం : 628 ఓట్లతో మొదలైన డీకే అరుణ ఆధిక్యం ఓ దశలో 17వేలకు చేరింది. అనూహ్యంగా 15వ రౌండ్ నుంచి ఆధిక్యం తగ్గుతూ వచ్చి, 21 రౌండ్ ముగిసే సరికి 3,636 ఓట్లకు పడిపోయింది. ఈవీఎం ఓట్లలో ఆధిక్యం తగ్గడంతో, అందరి దృష్టి పోస్టల్ బ్యాలెట్ల వైపు మళ్లింది. పోస్టల్ బ్యాలెట్లలో మొత్తం 8,708 ఓట్లు పోల్ కాగా, అందులో 4వేల ఓట్లు డీకే అరుణకు దక్కాయి.
ల్లా వంశీచంద్‌రెడ్డి 3,136 ఓట్లకే పరిమితమవడంతో 864 ఓట్ల ఆధిక్యం బీజేపీకు దక్కింది. దీంతో 4,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో డీకే అరుణ విజయం సాధించారు. ఎన్నికల్లో పోలైన 12 లక్షల 21 వేల ఓట్లలో, డీకే అరుణకు 5,10,747 ఓట్లు రాగా, చల్లా వంశీచంద్‌రెడ్డికి 5,06,247 ఓట్లు దక్కాయి. సిటింగ్ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నెశ్రీనివాస్‌రెడ్డి, లక్షా 54వేల ఓట్లతో మూడో స్థానానికి పరిమితయ్యారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు డీకే అరుణ తెలిపారు.
Mallu Ravi Wins in Nagarkurnool Lok Sabha Seat : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సైతం, తొలుత ఉత్కంఠగానే సాగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి, బీజేపీ తరఫున పోతుగంటి భరత్ ప్రసాద్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బరిలో నిలిచారు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. ఓ దశలో ఆధిక్యం 40వేలు దాటడంతో, గెలుపు హస్తం పార్టీదేనని ప్రత్యర్ధులు నిర్ధారణకు వచ్చారు. 22 రౌండ్లు ముగిసే సరికి పోస్టల్ బ్యాలెట్లతో కలుపుకుని 94,414 ఓట్లతో మల్లు రవి ఘన విజయం సాధించారు.
ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా రెండో స్థానంలోకి బీజేపీ : ఐతే, నాగర్‌కర్నూల్ ఎంపీ సీటు పరిధిలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు బలంగా లేనప్పటికీ 3లక్షల 70 ఓట్లతో భరత్ ప్రసాద్ రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ సిటింగ్ స్థానమైన నాగర్‌కర్నూల్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3క్షల 21వేల ఓట్లలో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఎంపీగా గెలిచిన మల్లు రవి, ఉమ్మడి పాలమూరు నేతలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిన మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో విజయబావుటా ఎగురవేయడంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. రాష్ట్రంలోని లోక్‌సభ ఫలితాల్లో అత్యంత తక్కువ మెజారీతో గెలిచిన స్థానంగా మహబూబ్‌నగర్ నిలిచింది.