Janwada Farm House Survey in Ranga Reddy District : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధీనంలో ఉన్న జన్వాడ ఫామ్‌హౌస్ పరిసరాలతో పాటు బుల్కాపూర్ నాలా పరిసర ప్రాంతాలను నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. కేటీఆర్ మిత్రుడు ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ బుల్కాపూర్ నాలా బఫర్ జోన్లో నిర్మించారని నీటిపారుదల శాఖ అధికారులకు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. మంగళవారం సాయంత్రం సర్వే చేసిన అధికారులు మరోసారి ఇవాళ మధ్యాహ్నం సర్వే చేశారు. ఆరుగురు అధికారుల బృందం సర్వే నిర్వహించింది. ఇద్దరు నీటిపారుదల శాఖ అధికారులు, నలుగురు రెవెన్యూ అధికారులు సర్వేలో పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఫామ్ హౌస్ పరిసరాలతో పాటు బుల్కాపూర్ నాలను సుమారు కిలోమీటర్ వరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ, సర్వేయర్ సాయి, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. నాలా పరిధిలోకి ఏయే సర్వే నంబర్లు వస్తున్నాయో ఆ వివరాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. గ్రామ నక్షాను తీసుకుని డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టం(డీజీపీఎస్) పరికరంతో అధికారులు సర్వే నిర్వహించారు.
ఎప్పటికప్పుడు సర్వే వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. గ్రామంలో వెట్ ల్యాండ్, డ్రైల్యాండ్ వివరాలతో పాటు బుల్కాపూర్ నాలా వివరాలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. రెండు, మూడు పాత మ్యాప్‌లను కూడా అధికారులు వెంట తీసుకుని వచ్చారు. వాటి ఆధారంగా గతంలో బుల్కాపూర్ నాలా ఎన్ని కిలోమీటర్ల వరకు ఉండేది. ప్రస్తుతం ఎంత వరకు ఉందనేది తెలుసుకున్నారు. గతంలో ఎంత వెడల్పులో ఉండేది ప్రస్తుతం ఎంత వరకు ఉందని చూశారు.
బఫర్ జోన్ పరిధిలో ఏ మేరకు నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. తదితర వివరాలన్నింటినీ సేకరిస్తున్నామని అధికారులు వివరించారు. పూర్తిస్థాయి సర్వే తర్వాత బుల్కాపూర్ నాలా ఎంత ఆక్రమణకు గురైందో తెలుస్తుందని అధికారులు వెల్లడించారు. రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. గతంలో గండిపేట జలాశయానికి వచ్చే వరద ఉద్ధృతిని నివారించేందుకు నీటిని బుల్కాపూర్ నాలా ద్వారా మళ్లించేవారు. బుల్కాపూర్, జన్వాడ, మణికొండ మీదుగా ఈ నాలా హుస్సేన్ సాగర్‌లో కలుస్తుంది.
ఈ నాలా ప్రస్తుతం 24 కిలోమీటర్లు మేర ప్రవహిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఫాంహౌస్ ప్రధాన గేటు సమీపంలోనే నాలా ఉండడంతో బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలా పరిధిని చూస్తే 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుందని నీటిపారుదల, రెవెన్యూ అధికారులు తెలిపారు.
'జన్వాడ ఫాం హౌస్ కూల్చొద్దు' - హైకోర్టులో పిటిషన్
రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత - అన్యాయం జరిగిందన్న బాధితులు