Nizamabad Lok Sabha Election 2024 : నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి బరిలో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ తరపున ఇటీవల ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఈ ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం మున్నూరుకాపు కావడం విశేషం.
గత పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసిన డీఎస్ తనయుడు ధర్మపురి అర్వింద్ అప్పటి సీఎం కేసీఆర్ కూతురైన సిట్టింగ్ ఎంపీ కవితను ఓడించారు. ఇప్పుడు సిట్టింగ్‌ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ అభ్యర్థిని (Nizamabad BRS MP Candidate) ఎంపిక చేసింది. సిట్టింగ్ ఎంపీ అర్వింద్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్‌ను బరిలోకి దించింది. కులం ఓట్లను చీల్చి ప్రయోజనం పొందేందుకే బీఆర్ఎస్ ఈ ఎత్తుగడ వేసిందన్న వాదన వినిపిస్తోంది.
BRS Bajireddy Govardhan Election Campaign : బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవల బీఆర్ఎస్ తరపున నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా రెండు సార్లు గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. గతంలో బాన్సువాడ, ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మొదట్నుంచీ డీఎస్ కుటుంబానికి, బాజిరెడ్డి కుటుంబానికి మధ్య రాజకీయ వైరం ఉంది.
ఇలా మొదలైన కుల రాజకీయాలు : డీఎస్ పీసీసీగా ఉన్నప్పుడు ఎదుర్కొనేందుకు అదే కులానికే చెందిన బాజిరెడ్డిని బీఆర్ఎస్లోకి తీసుకొచ్చారని అంటారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయోగం చేస్తోంది బీఆర్ఎస్. మున్నూరు కాపు ఓట్లను చీల్చడానికే ఆ సామాజిక వర్గం నుంచి బాజిరెడ్డిని బరిలోకి దింపారు. అయితే ఎంత మేర ప్రయోగం ఫలిస్తుందోనన్న అనుమానం లేకపోలేదు. అయితే గత ఆరేళ్లలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ బలపడిందని అదే తమకు కలిసి వస్తుందని సిట్టింగ్ ఎంపీ అర్వింద్ అంటున్నారు.
మున్నూరుకాపు ఓట్లను చీల్చాలని ఆ సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డిని బరిలోకి దింపడంతో బీఆర్ఎస్ కులరాజకీయానికి తెర లేపిందని ఆ వర్గం నాయకులు మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల ఇతర కులాలకు చెందిన ఓటర్లు దూరమయ్యే అవకాశమూ ఉందని అంటున్నారు. ఇదే కోణంలో మున్నూరు కాపు ఓటర్లు ఆలోచిస్తే ఓట్లు చీలే అవకాశం అంతగా ఉండదనీ అంటున్నారు. బీజేపీ ఓటు బ్యాంకు కేవలం మున్నూరుకాపులే కాదిప్పుడు.
ఎంపీ ఎన్నికలంటేనే మోదీ అంటున్న జనం: యువత, భావోద్వేగంతో కూడిన ఓటర్లు బీజేపీకు అతిపెద్ద బలం ఇప్పుడు. అదే కాకుండా మోదీ మానియా అతిపెద్ద బలంగా ఆ పార్టీ భావిస్తోంది. ఎంపీ ఎన్నికలంటేనే మోదీ ఓటుగా (Modi Election Campaign) ప్రజలు భావిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజల మద్దతూ మోదీకి ఉందని అంటున్నారు. దీంతో పాటు గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఇచ్చిన పసుపు బోర్డును హామీని సైతం నెరవేర్చింది.
Turmeric Board In Nizamabad : అదనంగా పసుపు పంట ధర రూ.20వేలు దాటింది. ఇది కూడా బీజేపీకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇన్ని సానుకూల అంశాలు ఉండగా కులం ఓట్లు చీలుతాయని ఆ పార్టీ భావించడం లేదని విశ్లేషకులు అనుకుంటున్నారు. కాంగ్రెస్ సైతం మున్నూరు కాపు సామాజిక వర్గం వ్యక్తిని బరిలో నిలపాలని భావించినా ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతోంది. త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేయాలని చూస్తోంది.
ఎంపీ అభ్యర్థిత్వాలపై బీఆర్ఎస్ ఫోకస్ - హైదరాబాద్, నల్గొండ సీట్లపై కసరత్తు
నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ స్థానాల్లో బీసీ మంత్రం - ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల వ్యూహం