New PCC Leader in Telangana Congress : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది. ఇటీవల దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ అగ్రనేతలతో చర్చించారు. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానానికి రాష్ట్ర నేతలు వేర్వేరుగా అభిప్రాయాలు చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పలుమార్లు సమాలోచనల అనంతరం బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి అప్పగించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం : బీసీలలో మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌లు పోటీ పడుతుండగా వీరిద్దరికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఏఐసీసీ తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వీరి పాత్ర, నాయకులతో సమన్వయం చేసుకునే పరిస్థితులు ఎవరికి మెరుగ్గా ఉన్నాయని రాష్ట్ర నేతలను ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకోగలిగే నేతను ఎంపిక చేయాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ లోతైన కసరత్తు చేసినందున ఒకట్రెండు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులనూ భర్తీ చేసే ఛాన్స్ : పీసీసీ అధ్యక్ష పదవితోపాటు నాలుగైదు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులనూ భర్తీ చేయాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి రాంచంద్రనాయక్ లేదా బాలు నాయక్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఎస్సీల నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ను వరించే అవకాశం ఉంది. బీసీలలో గౌడ సామాజివర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కనుండటంతో యాదవులకు ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇందులో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, గద్వాల్ మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ సరిత లేదా మాజీ ఎంపీ అంజన్ కుమార్‌కు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. పదవుల భర్తీ తరువాయి పూర్తిస్థాయి పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు ఏఐసీసీ చొరవ చూపుతుందని తెలుస్తోంది.
తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరు? - రేసులో ఆ ఇద్దరు! - TELANGANA PCC CHIEF BC CANDIDATE