MP Chamala Kiran Kumar Fires on Harish Rao : తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేశామని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, గత బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు. 2018లో మరోసారి రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి మర్చిపోయారన్న ఆయన, 2023 వరకు బీఆర్ఎస్ నేతలకు రైతులు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదని విమర్శించారు. రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావును అడిగితే నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న చామల కిరణ్కుమార్, బీఆర్ఎస్ మంచి చేసి ఉంటే ప్రజలు ఎన్నికల్లో వారిని ఓడించకపోయేవారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో చీకటి జీవోలిచ్చి ఎంత కొల్లగొట్టారో తెలుసుకునేందుకు తమకు నెల రోజులు పట్టిందని ఆయన తెలిపారు.
ఈ క్రమంలోనే బండి సంజయ్ కేంద్రమంత్రి అయ్యారు కానీ, ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఎంపీ చామల ఎద్దేవా చేశారు. కేటీఆర్కు చేతనైతే బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందంటున్న బండి సంజయ్ మాటలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం గురించి కేటీఆర్కు పట్టట్లేదని విమర్శించారు.
"22 లక్షల 37వేల 848 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ గోబెల్ లాగా తయారయ్యారు. రుణమాఫీ అయిన రైతులందరూ కేటీఆర్ మాటలకు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డికి ,కేటీఆర్కు పోలిక ఏంటి. రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన వ్యక్తి. ఆయన రాజకీయాల్లో మా లాంటి ఎంతో మందికి ఆదర్శం. ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము రాజకీయాల్లో కొనసాగుతున్నాం. కేసీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో ఉండో లేదో కూడా తెలియదు." - చామల కిరణ్ కుమార్, భువనగిరి ఎంపీ
వారిని చూసి నేర్చుకోండి : ప్రతిపక్షంలో ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, డీఎంకే దగ్గర నేర్చుకోవాలని కేటీఆర్కు చామల కిరణ్కుమార్ హితవు పలికారు. బీఆర్ఎస్ను గద్దె దింపడానికి వాళ్ల వైఖరే కారణమన్నారు. బీఆర్ఎస్ దౌర్భాగ్య పాలన వల్లే ఈరోజు రాష్ట్ర ఖజానా దిగజారిందని విమర్శించారు. పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళితే, మీ పైశాచిక ఆనందం ఏంటని మండిపడ్డారు. రాజీనామా చేస్తానన్న బీఆర్ఎస్ నాయకులు బాలి బీచ్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 2024 - ఆగస్ట్ నుంచి 2025 ఆగస్టు వరకు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పాలన చూడండని చెప్పారు.
అతి త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యం : సంజయ్ - UNION MINISTER BANDI SANJAY