MLC Kavitha Petition on CBI Investigation : దిల్లీ మద్యం విధానం కేసులో తనను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతివ్వటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తమకు దరఖాస్తు అందించలేదని కోర్టుకు వివరించారు. కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.
దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టైన కవితను ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి శుక్రవారం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఉన్న తిహాడ్ జైలులోనే ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని పరిశీలించిన కోర్టు పలు షరతులతో అనుమతి ఇచ్చింది. దీనిపై రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు దర్యాప్తు సంస్థ సమయం కోరింది. ఏ నిబంధనల ప్రకారం అప్లికేషన్ దాఖలు చేశారో చెప్పాలని న్యాయమూర్తి కావేరి భవేజా సీబీఐకి సూచించారు.
ఈ విషయంలో కోర్టు సంతృప్తి చెందేలా సమాధానం ఉండాలని చెప్పారు. కవిత పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల 10 వరకు సమయం ఇచ్చిన న్యాయమూర్తి, తదుపరి విచారణను ఈ నెల 10న చేపట్టనున్నట్లు ప్రకటించారు. కవితను సీబీఐ విచారించడంపై "స్టేటస్ కో" ఉత్తర్వులు ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోరగా, అందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాతే, ఏ ఉత్తర్వులు అయినా ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.
Delhi Court Allows CBI To Investigate MLC Kavitha : దిల్లీ మద్యం కేసులో అరెస్టై ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా శుక్రవారం సీబీఐకి అనుమతిచ్చారు. ఇందుకోసం సీబీఐ చేసిన దరఖాస్తుపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కవిత కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ తరఫు న్యాయవాదులు శుక్రవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవిత పాత్రకు సంబంధించిన ఆధారాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఫిబ్రవరి 26న విచారణకు హాజరుకావాలని పిలిస్తే రాలేదని కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత ఇదే కేసులో ఈడీ మార్చి 15న ఆమెను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు దొరికిన సాక్ష్యాధారాల ప్రకారం ఈ కేసులో ఆమె పాత్రపై తదుపరి విచారించాల్సి ఉన్నందున జైలుకెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి అనుమతివ్వాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది.
వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి విచారణకు అంగీకరించారు. వచ్చే వారం రోజుల్లో ఏదో ఒకరోజు జైలు సూపరింటెండెంట్‌కు ముందస్తు సమాచారం ఇచ్చి విచారించడానికి అనుమతిచ్చారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసేటప్పుడు అసిస్టెంట్/డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అక్కడ ఉండేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి జైలు అధికారులకు నిర్దేశించారు. ఒకవేళ జైల్లో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తే దాన్ని ధ్రువీకరిస్తూ ఆ అధికారి తప్పనిసరిగా సంతకం చేయాలన్నారు . వాంగ్మూలం ఇవ్వడం అన్నది కవిత ఇష్టమని, అందుకోసం ఆమెపై ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు చేయకూడదని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.