MLA Padi Kaushik Reddy Challenge To Arekapudi Gandhi : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్య సవాల్ దుమారం రేపుతుంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. అరెకపూడి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. దాన్ని స్వీకరిస్తున్నట్లు అరెకపూడి గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొండాపూర్‌లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా నియమిస్తూ ఇటీవల శాసన సభాపతి నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అరెకపూడి ఇంటికి వెళ్తానని, బీఆర్ఎస్ కండువా కప్పుతానని సవాల్ విసిరారు. దీంతో ఎమ్మెల్యే అరెకపూడి స్పందించారు.
బాత్రూమ్లో ఉండి డీలింగ్‌లు నడిపే ప్రతి ఒక్కడూ ఇవాళ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ ఇంటికొస్తా ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటే ఖాళీగా ఉన్నామా అని అన్నారు. కేసీఆర్ లాంటి పెద్ద మనుషులు అలాంటి కామెంట్స్ చేస్తే స్వాగతించేవాడినన్న ఆయన, తనతోటి శాసన సభ మిత్రులు అడిగినా బదులిచ్చేవాడినని తెలిపారు. ఇలాంటి వారు నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు.
"నన్ను గెలిపించకుంటే చచ్చిపోతా అని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన ఇలాంటి వారికి నా గురించి మాట్లాడే అర్హత లేదు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంలో ప్రజలు నన్ను మూడుసార్లు గెలిపించారు. వారికి నేను సమాధానం ఇస్తా, కానీ ఇలాంటి బ్రోకర్లకు, లోఫర్లకు, చీటర్లకు నేను జవాబు చెప్పే అవసరం లేదు. ఎమ్మెల్యేల ఫిరాయింపులో దిల్లీ దాక చర్చలు చేసిన నీకు, నా గురించి మాట్లాడే అర్హత లేదు. నేనే మీ ఇంటికి వస్తా. తట్టుకునే దమ్ముందా" - అరికెపుడి గాంధీ, ఎమ్మెల్యే
మీ రాజకీయాల కోసం కుటుంబ బంధాల మధ్య చిచ్చుపెట్టారు : హరీశ్‌రావు - Harish Rao sensational comments