Minister Tummala Reply on KTR Letter : మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖ దొంగే, దొంగ దొంగ అన్నట్లు ఉందని జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆక్షేపించారు. గత పదేళ్లల్లో చేనేత రంగాన్ని అన్ని స్థాయిల్లో అస్తవ్యస్తం చేసి స్వంత లాభాలకు వాడుకుని ఇప్పుడు లేఖ పేరిట రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని తప్పుపట్టారు.
గత ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధిచేకూరే పథకాల కోసం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం 2018 సంవత్సరంలో పవర్ లూమ్ కార్మికులకు పెట్టుబడి రాయితీ లింక్డ్ వేతనాల పరిహార పథకం ప్రవేశపెట్టి నిధులు విడుదల చేయలేదని గుర్తుచేశారు. రూ.33.23 కోట్ల నిధులు నేత కార్మికులకు 10 శాతం యాటర్న్ రాయితీ రూపంలో టెస్కో నిధుల నుంచి విడుదలచేశామని చెప్పారు.
Minister Tummala on Handloom Sector : పద్ధతి ప్రకారం అసలైన నేత కార్మికులకు లబ్ధిచేకురేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా 2024-25 సంవత్సరానికి కేటాయించిన 400 కోట్ల రూపాయల బడ్జెట్ వినియోగించేందుకు సీఎం అంగీకరించారని ప్రకటించారు.
టెస్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయడానికి ఇచ్చిన ఆదేశాలు ప్రకారం ప్రభుత్వ శాఖల నుంచి సుమారు రూ.255.27 కోట్లు విలువైన ఆర్డర్లు వస్త్ర సరఫరా కోసం వచ్చాయని చెప్పారు. గతంలో జౌళి మంత్రిగా పనిచేసిన కేటీఆర్, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో ఏం చొరవ చూపించకపోవటం వల్ల చేనేత ఉత్పత్తులకు ఈ-మార్కెటింగ్ అమలు కాలేదని ఆరోపించారు.
బతుకమ్మ చీరల పథకం కింద టెస్కోకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్ : ఈ-మార్కెటింగ్ చేయడానికి కృతనిశ్చయంతో ముందుకు సాగుతూ, ఉత్పత్తుల అమ్మకాలకు వెసులుబాటు కల్పించి వృత్తిపై ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నేతన్నలకు పని కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు చేసిన మోసాలు మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయని ప్రస్తావించారు.
2023లో బతుకమ్మ చీరల పథకం కింద టెస్కోకు చెల్లించాల్సిన 351.52 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేదు. మేం వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. సమగ్ర శిక్ష 2023-24 పథకం కింద గత ప్రభుత్వం బకాయి ఉన్న రూ.108 కోట్లు కూడా విడుదల చేశామని, గత ప్రభుత్వం 2023 నవంబరు వరకు సుమారు రూ.488.38 కోట్లు పలు ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన వస్త్రాల బకాయిలు టెస్కోకు చెల్లించాల్సి ఉందని వివరించారు.
ప్రజాజీవితంలో గుణపాఠం తప్పదు : గతంలో అవినీతి, అవలంభించిన అస్తవ్యస్త విధానాల ద్వారా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నారని మంత్రి విమర్శించారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులు పూటకో మాట మాట్లాడుతూ నేతన్నలు, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించాలని అనుకుంటున్నారని ఆరోపించారు.
కానీ, ప్రజలకు గులాబీ పార్టీ చేసిన మోసాలన్నీ తెలుసని, అందుకే ప్రస్తుతం వాళ్లకు ఈ గతి పట్టిందని దుయ్యబట్టారు. ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని లేఖలు రాసిన ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రాజకీయ పబ్బం కోసం వివిధ రాజకీయ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తూ నేత కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే యత్నాలు మానుకోవాలని, లేకపోతే ప్రజాజీవితంలో గుణపాఠం తప్పదని మంత్రి తుమ్మల హెచ్చరించారు.
చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా చర్యలు చేపడుతున్నాం : మంత్రి తుమ్మల