Minister Seethakka Fires on MLC Kavitha : మహిళలను అందలమెక్కిస్తూ, అగ్రభాగానికి తీసుకెళుతుంటే ఓర్వలేకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేస్తున్నారని మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Seethakka) దుయ్యబట్టారు. హనుమకొండలోని కేయూలో రూ.68 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి సీతక్క, అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అతివలను కోటీశ్వరులను చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. కాంగ్రెస్ సర్కారు మహిళలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తోందని తెలిపారు. సరిపడా ఆర్థిక నిల్వలు లేకపోయినా ఒకటో తేదీన జీతాలిస్తున్నట్లు వివరించారు. అసలు జీవో నంబరు 3 ఇచ్చిందే కేసీఆర్ ప్రభుత్వమని మంత్రి సీతక్క గుర్తు చేశారు.
Minister Seethakka Comments on Kavitha : ఇకపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం అపాలని మంత్రి హెచ్చరించారు. ఇప్పటివరకు ప్రభుత్వంపై అనవసరమైన విమర్శలు చేసిన ఎమ్మెల్సీ కవిత(Kavitha), బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే తాను సీఎం కావాలని భావించినట్లు మంత్రి సీతక్క విమర్శలు చేశారు. పార్టీ ఓటమితో ఆమె ఆశలన్నీ గల్లంతయ్యాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మక విపక్షంగా పని చేయాలని సీతక్క సూచించారు.
"నిన్న కాక మొన్న కవిత అంటున్నారు ఈ సారి గవర్నమెంటు మనదే వస్తుంది. మళ్లీ కేసీఆర్నే సీఎం అవుతారు. ఆయన కుర్చీ నుంచి దిగిపోతే నేనే సీఎం కావచ్చు అనుకుంది. ఎందుకంటే ఆమెను ప్రజలు ఓడించిన కూడా ఆగలేకుండా ఆరు నెలలోనే ఎమ్మెల్సీ పదవిని చేపట్టింది. పాపం ఎంతో మంది బయట రాజకీయ పదవుల్లో లేకున్నా అలానే ఉంటున్నారు. పిల్లలు ఫెయిల్ అయితే సప్లమెంటరీ పరీక్ష రాస్తారు. కానీ అలా కాకుండా ఆమె మెనేజ్మెంట్ కోటాలో తండ్రి నుంచి తెచ్చుకుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యువతకు ఉద్యోగాలు ఇస్తుంటే విమర్శిస్తున్నారు. జీవో నెంబరు 3 ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తున్నారు. మహిళలను అన్యాయం చేసే పార్టీ కాదు మహిళలను అగ్రభాగాన నిలిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ." - సీతక్క, మాతా,శిశు సంక్షేమ శాఖ మంత్రి
మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. కేయూ భూమి కబ్జాకు గురికాకుండా ప్రహరీ గోడను నిర్మిస్తామని మాటిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే 30 వేలు ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి పొంగులేటి హర్షం వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు చేసింది ఏమీలేదు : మంత్రి సీతక్క