Minister Ponnam on BJP Manifesto : బీజేపీ బలహీన వర్గాల వ్యతిరేక పార్టీ అని, రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) ఆరోపించారు. కమలం పార్టీ మేనిఫెస్టోలో 14 అంశాల్లో, ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధంలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్‌లో బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలను చేర్చినట్లు తెలిపారు. బలహీనవర్గాలు ఆలోచించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలువాలని ఆయన కోరారు.
కుల గణన సర్వే చేయడానికి కాంగ్రెస్(Congress) సిద్దంగా ఉందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. అందుకు సంబంధించి పాంచ్ న్యాయ్‌లో ఒక అంశంగా పెట్టామని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం(BJP) పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా వ్యవహారిస్తోందని, బడా బిజినెస్‌మెన్‌లకే లాభం చేకూరుస్తున్నారని దుయ్యబట్టారు. ఈసారీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Minister Ponnam on Handloom Sector : చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పెద్దలను సన్మానించాలన్నా, మంత్రులను కలిసినప్పుడు శాలువాలకు బదులు కాటన్ టవల్స్ ఇవ్వాలన్నారు. లేదంటే పిల్లలకు ఉపయోగపడే పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలని తెలిపారు. తద్వారా చేనేతను కాపాడుకోచ్చని పేర్కొన్నారు. మంత్రులకు సైతం అవే ఇవ్వాలని కోరారు. మర్యాదకోసం అందించే శాలువాలు వాడటానికి పనికిరావని, వాటిని కప్పుకోకపోతే అవమానపరిచినట్టు అవుతుందన్నారు. నలుగురికి ఉపయోగపడే కాటన్‌తో అతిథులను సత్కరించాలని కోరారు.
"బలహీనవర్గాల నేతగా చెప్పుకునే నరేంద్ర మోదీ, వారి అభివృద్ధికి బీజేపీ మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వలేదు. కమలం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో 14 అంశాల్లో, ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధంలేదు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్‌లో బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలను చేర్చాము. బలహీనవర్గాలు ఆలోచించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలువాలని కోరుకుంటున్నాను". - పొన్నం ప్రభాకర్, మంత్రి.
Ponnam Deeksha : మరోవైపు ఆదివారం నాడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్‌లోని ఇందిరా భవన్‌లో కమలం పార్టీ పాలనలో రాష్ట్రానికి చేసిన అన్యాయం, కేంద్రం వైఫల్యాలపై ఆయన నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే బీజేపీనేతలు, పదేళ్లలో వారు ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారని వేశారా అని ప్రశ్నించారు.