Minister Ponnam Comments on BJP : రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గ పాలనకు బీజేపీ కూడా సహకరించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి ఏడు లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ కరీంనగర్లో అలుగునూరులోని నిర్వహించిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
రాష్ట్రంలో గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, రైతులకు బోనస్ తప్పకుండా ఇస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నేత వినోద్‌కుమార్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధర్మపురికి ప్రసాద్ పథకం నిధులివ్వలేదని విమర్శంచారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని, కష్టపడ్డ వారికే నామినేటెడ్ పదవులను ఇస్తామన్నారు.
Minister Ponnam in Karimnagar Meeting : తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రీయ విద్యాలయం, మోడల్ స్కూల్స్, ఆసుపత్రులు తీసుకొచ్చానని మంత్రి పొన్నం తెలిపారు. మరీ వినోద్, బండి సంజయ్ ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ను 30 వేల మెజార్టీతో గెలిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశ నిర్మాణం కోసం తాము ప్రారంభించిన అనేక పరిశ్రమలు, ఇప్పుడు అదానీ, అంబానీలకు బీజేపీ విక్రయిస్తుందని ఆరోపించారు.
ఎన్నికల బాండ్ల రూపంలో వేల కోట్ల అవినీతి జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి ఏ సమస్య ఉన్నా స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్భోదించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినట్టు ఎక్కడా అవినీతికి ఆస్కారం లేదని, కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో విద్వేషాలు పోవాలని, ప్రేమ పెరగాలని ఆకాంక్షించారు. పారదర్శకమైన డెమోక్రాటిక్ పాలన రావాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని, అటువంటి నాయకుడిని ప్రధానిగా చూడాలని పేర్కొన్నారు.
'కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలపునకు కార్యకర్తలు కృషి చేయాలి. రాష్టంలో అవసరమైన నామినేటెడ్ పదవులు ఉన్నాయి. కష్టపడిన వారికి తప్పకుండా పదవులు వచ్చేలా చూస్తాం. మే 13న పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మనకు సమయం చాలా తక్కువ ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలు నడుస్తున్నాయి.'-పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి
బీజేపీ అమలు చేయని హామీలపై చర్చకు సిద్ధమా : మంత్రి పొన్నం ప్రభాకర్ - Lok Sabha Elections 2024