Minister Komati Reddy Reaction on Harish Rao Resignation : ఆగస్టు 15న రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడం బీఆర్ఎస్ నేతలు మానుకోవాలని హితవు పలికారు. హరీశ్‌రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరానని గొప్పలు చెప్పుకుంటున్నారన్న ఆయన, ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు మాజీ మంత్రి భయపడుతున్నారని విమర్శించారు. హరీశ్ రావు నాటకాల రాయుడని, రాజీనామా డ్రామాతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టె లేదని అమాయకులను చంపిన వ్యక్తి హరీశ్ రావన్న మంత్రి, ఇప్పుడు దొంగ రాజీనామా లేఖలు ఎందుకు ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో మాట్లాడారు.
హరీశ్‌రావు నాటకాల రాయుడు. మళ్లీ జోకర్లా తయారయ్యారు. ఎమ్మెల్యే రాజీనామా ఒక్కటే లైన్ ఉంటుంది. హరీశ్‌రావుది దొంగ రాజీనామా. ఆగష్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం చెప్పారు. చెప్పినట్లుగానే చేసి తీరుతాం. ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు హరీశ్‌రావు భయపడుతున్నారు. - మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Parliament Elections 2024 : ఈ క్రమంలోనే బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) గెలిస్తే తొలి సీఎం దళితుడని చెప్పిన కేసీఆర్, రెండుసార్లు అధికారంలోకి వచ్చినా ఆ హామీని నిలబెట్టుకోలేదని కోమటిరెడ్డి విమర్శించారు. ఎస్సీలకు మూడెకరాల పేరుతో మోసగించారని, ఉపాధి హామీ కూలీలకు కనీసం 100 రోజుల ఉపాధి కల్పించలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో పాలకులు చేసిన విధ్వంసాన్ని చక్కబెడుతూ పాలన సాగిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్నప్పుడు ఫాంహౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్, ఇప్పుడు కర్ర పట్టుకుని బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూతపడే స్థితికి వచ్చిందన్న మంత్రి, మెదక్‌లో భారత రాష్ట్ర సమితి కనీసం డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ విసిరారు.
'బీఆర్ఎస్ గెలిస్తే తొలి సీఎం దళితుడని నాడు కేసీఆర్ చెప్పారు. దళితుడిని సీఎం చేయకపోతే మెడపై తల ఉండదని గొప్పలు చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చాక పరిపాలన అనుభవం ఉండాలని తొలిసారి కేసీఆర్ సీఎంగా ఉండాలన్నారు. రెండోసారి గెలిచినా దళితుడిని సీఎం చేయలేదు. అధికారం పోగానే కేసీఆర్ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు.' - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి
అధికారం లేక మానసికంగా ఇబ్బందిపడుతున్నారు : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 40 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారని కోమటిరెడ్డి వివరించారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని, మార్చి 1 నుంచి జీరో విద్యుత్ బిల్లులు ఇస్తున్నామని తెలిపారు. కనీస పరిజ్ఞానం లేకుండా పాలించి, కేసీఆర్ ఇప్పుడు కొత్త నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. 'సోనియా దేవత. ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు' అని గతంలో కేసీఆర్ చెప్పారన్న మంత్రి, అధికారం లేకపోయేసరికి ఇప్పుడు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని ఎద్దేవా చేశారు.
హరీశ్‌రావు సిద్ధంగా ఉండాలి : ఆగస్టు 15న రాజీనామాకు సిద్ధంగా ఉండాలని హరీశ్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రూ.2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌కు మద్దతుగా సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రచారం నిర్వహించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కోహెడలో పొన్నం రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలుగా పని చేసిన బండి సంజయ్, వినోద్‌కుమార్ కరీంనగర్ ప్రజలకు ఏం చేశారని పొన్నం ప్రశ్నించారు.